Hyderabad : హైడ్రా కమిషనర్ కు హైకోర్టు సమన్లు
తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు సమన్లు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు సమన్లు జారీ చేసింది. బాగ్ అంబర్‌పేట్‌లోని బత్తుకమ్మకుంటకు సంబంధించి తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. హైకోర్టు ఈ ఏడాది జూన్ 12న జారీ చేసిన ఆదేశంలో, హైడ్రా ఏజెన్సీ వర్షాకాలానికి ముందు చేపట్టే పనులు వివాదాస్పద భూభాగాన్ని ఆక్రమించకుండా కొనసాగుతాయని చెప్పిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించింది. ఈ ఏడాది మే 7వ తేదీన మరో బెంచ్ ఆ భూమిపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించగా, మే 28న ఆ ఉత్తర్వును సవరించి పరిమిత స్థాయిలో వరద నివారణ పనులకు అనుమతించింది.
ఈ నెల 27న హాజరు కావాలని...
అయితే సరస్సులో విస్తృతంగా మార్పులు చేసినందుకు బీఆర్‌ఎస్ నాయకుడు ఏ.సుధాకర్ రెడ్డి కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. తాను ఆ భూమిపై హక్కు కలవాడినని పేర్కొంటూ, హైడ్రా సంస్థ, విమోస్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌పీఆర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థల పేర్లు ఉన్న ప్రారంభ ఫలకాన్ని సాక్ష్యంగా సమర్పించారు. న్యాయమూర్తులు మౌషుమీ భట్టాచార్య, బి.ఆర్.మధుసూదన్‌రావు సభ్యులుగా ఉన్న డివిజన్ బెంచ్ ఈ వ్యవహారం కోర్టు ధిక్కారానికి తావిస్తున్నదని పేర్కొంటూ, హైడ్రా కమిషనర్‌ను హాజరు కావాలని ఆదేశించింది.