Hyderabad : హైదరాబాద్ లో మూడు గంటల నుంచి కుండపోత వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. క్యుములోనింబస్ మేఘాలతో కుండపోత వర్షం పడుతుంది
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. క్యుములోనింబస్ మేఘాలతో కుండపోత వర్షం పడుతుంది. హైదరాబాద్ నగరంలో రెండు గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ ను నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఎటు చూసినా నగరంలో వర్షం దంచి కొడుతుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమయిన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. రాబోయే రెండు నుంచి మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
షేక్ పేట్ లో అత్యధికంగా...
హైదరాబాద్ షేక్ పేట్ లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హైదరాబాద్ లోని మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్, అమీర్ పేట్, లక్డీకాపూల్, ఆబిడ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మొహిదీపట్నం, ఎల్బీనగర్, మలక్ పేట్, సరూర్ నగర్, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఈరోజు కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోయింది. అనేక చోట్ల ట్రాఫిక్ స్థంభించి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
నాలాలు పొంగి...
ఆఫీసుల నుంచి పాఠశాలలు వదలే సమయం కావడంతో అందరూ ఒక్కసారిగా వర్షం పడటంతో ఇంటికి చేరేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నాన్ స్టాప్ వర్షంతో నాలాలు కూడా పొంగిపొరలుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయి చర్యలు చేపట్టారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో నీరు నిల్వకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. రాజధాని హైదరాబాద్ రహదారులు వరదను తలపిస్తున్నాయి. భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజలు కూడా ఇళ్లను వదిలి బయటకు రావద్దని సూచించారు.