హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్నారా? ఇక ఎనిమిది గంటల్లోనే గమ్యస్థానానికి
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి తెలంగాణను కలుపూత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ రహదారికి 365 BG అని పేరు పెట్టారు. ఆగస్టు 15వ తేదీన ఈ హైవేను ప్రారంభించాలని శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం - దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారి మిగిలిన వాటికంటే పూర్తి భిన్నమైనదని చెబుతున్నారు. పచ్చటి పొలాల మధ్యలో నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మూడేళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టారు.
గ్రీన్ ఫీల్డ్ రహదారి...
దేవరపల్లి - తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ల వద్ద రెండు కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. 162 కిలోమీటర్ల దూరం ఉన్న నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే ను పచ్చటి పొలాల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 4609 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ రహదారి కోసం 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ - విశాఖపట్నం దూరం తగ్గించేందుకు ప్రధానంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు సుమారు 12 గంటల పాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఛార్జీలు తగ్గే ఛాన్స్...
ఈ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే సుమారు 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కేవలం ఎనిమిది గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. అలా నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది. ఈ రహదారి నిర్మాణంతో ప్రయివేటు వాహనాల మాట అటుంచితే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ప్రయివేటు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా తగ్గే అవకాశముంది. ఈ హైవేపై బస్సులు తక్కువ దూరం ప్రయాణించడం వల్ల గతంలో ఉన్న ప్రయాణ ఛార్జీ కన్నా తక్కువ ఖర్చుతో తమ గమ్యస్థానానికి చేరుకునే అవకాశముంది. ఇక పెట్రోలు, డీజిల్ ఖర్చులు కూడా సొంత వాహనాలను వినియోగించేవారకు చాలా వరకూ ఆదా అవుతుంది. అదే సమయంలో టోల్ ఛార్జీలు పడతాయి. కానీ సుఖంగా, ప్రమాదం లేని ప్రయాణాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన వారు చేయవచ్చు.