Hyderabad : హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. నేడు రెండు ఫ్లైఓవర్లు ప్రారంభం
హైదరాబాద్ నగరవాసులకు నేడు గుడ్ న్యూస్. రెండు ఫ్లే ఓవర్లు అందుబాటులోకి రానున్నాయి
హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ చాలా వరకూ నియంత్రించడానికి వీలవుతుంది. ఫ్లై ఓవర్ల కారణంగానే జనాభా ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, రోజువారీ హైదరాబాద్ కు రాకపోకలు సాగించే వారు ఎక్కువవుతున్నా, వాహనాల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతున్నా ట్రాఫిక్ సమస్యకు ఫ్లై ఓవర్ల ద్వారానే చెక్ పెడుతూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించలేకపోయినప్పటికీ ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్లలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సులువుగా వెళుతుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కు కాకుండా కొంత స్లోగా అయినా వాహనాలు వెళ్లిపోవడానికి ప్రధాన కారణం ఫ్లై ఓవర్లేనని చెప్పాలి. మరొకవైపు మెట్రో రైలు రాకతో కూడా ట్రాఫిక్ రద్దీ కొంత వరకూ తగ్గింది.
ఫ్లఓవర్లతోనే ట్రాఫిక్ నియంత్రణ...
గత కొన్నేళ్లుగా ఫ్లైఓవర్లను ప్రభుత్వాలు నిర్మిస్తున్నా ఎప్పటికప్పుడు.. ఎక్కడికక్కడ పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీని అంచనా వేసి అక్కడ ఫ్లేఓర్లను నిర్మిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ పై దృష్టి పెట్టాయని చెప్పాలి. ఎక్కడక్కడ ఫ్లై ఓవర్లను నిర్మించడంతో పాటు కింద నుంచి వెళ్లిపోయే అండర్ పాస్ లనిర్మాణం కూడా చేపడుతుండటంతో చాలా వరకూ ప్రయాణం సులువుగా మారింది. హైదరాబాద్ లో ఫ్లై ఓవర్లే లేకుంటే ట్రాఫిక్ పరిస్థితిని ఊహించుకోవడం కూడా భయమేస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఫ్లై ఓవర్ల నిర్మాణాలను అన్ని ప్రభుత్వాలు చేపడుతున్నాయి. వాటికి ప్రాధాన్యత ఇచ్చిన కారణంగానే నేడు ట్రాఫిక్ కొంత వరకు అయిన నియంత్రించగలిగారు.
బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను...
ఈరోజు హైదరాబాద్ లో మరో రెండు ఫ్లై ఓవర్లను కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. నితిన్ గడ్కరీ బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు అంబర్ పేట్ ఫ్లైఓవర్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ లో ట్రాఫిక్ విపరీతగా పెరిగింది. నగరం విస్తరించడంతో ఇటు వైపు వాహనాల రాకపోకలు ఎక్కువ కావడంతో తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. హైదరాబాద్ - ముంబయి హైవే కావడంతో ఇక్కడ జంక్షన్ దాటాలంటే రెండు కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఇరవై నిమిషాలు పైనే పడుతుంది. 130 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. నేడు ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనుండటంతో ట్రాఫిక్ కష్టాలకు తెరపడనున్నాయి.
అంబర్ పేట్ ఫ్లైఓవర్...
మరొక కీలకమైన ఫ్లైఓవర్ అంబర్ పేట్. ఛే నెంబరు రోడ్డులో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో చాలా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుంది. చాదర్ ఘాట్, నింబోలి అడ్డ, గోల్నాక, అంబర్ పేట్, రామంతాపూర్ , ఉప్పల్, వరంగల్ వైపు వెళ్లే వాహనాలు సులువుగా వెళ్లేందుకు సాధ్యమవుతుంది. ఏళ్ల తరబడి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. 335కోట్లల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. కాస్త ఆలస్యమయినా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కానుండటంతో ఇక ఈ ప్రాంతవాసులు వేగంగా వెళ్లేందుకు మార్గం సుగమమయింది.