Hyderabad : మిర్చిలేదు. బజ్జీ లేదు.. పావు లేదు.. భాజీ లేదు
హైదరాబాద్ వాసులకు గ్యాస్ కొరత నోటి రుచులను దూరం చేస్తుంది.
హైదరాబాద్ వాసులకు గ్యాస్ కొరత నోటి రుచులను దూరం చేస్తుంది. మిర్చి బజ్జీలు అందుబాటులో ఉండటం లేదు. చిరు వ్యాపారులు ఎక్కువగా మిర్చి బజ్జీలు తయారు చేస్తుంటారు. హైదరాబాద్ లో మిర్చి బజ్జి అంటే ఫేమస్. అలాంటిది గ్యాస్ సంక్షోభంతో అనేక చిరు దుకాణాలు మూతబడ్డాయి. మిర్చిబజ్జీలు కొన్ని చోట్ల లభిస్తున్నా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో తినాలని ఉన్నా..ధరలను చూసి జనం జడుుచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ ఒక ప్లేట్ లో నాలుగు మిర్చీలు వేసి నలభై రూపాయలు తీసుకునే వారు. కానీ నేడు ప్లేటు మిర్చి ధర ఎనభై నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు.
మిరపకాయ బజ్జీలు కరువే...
ఇక హైదరాబాద్ లో స్వీట్లు, హాట్ వంటి చిరు తిండ్లకు గిరాకీ ఎక్కువ. హైదరాబాద్ లో వేల సంఖ్యలో స్వీట్ దుకాణాలున్నాయి. మార్వాడీ దుకాణంలో లభించే సమోసా, మిరపకాయ్ లు కూడా దొరకడం లేదు. సమోసాతో తింటూ మిరపకాయ నంజుకుంటే ఆ మజా వేరు. కానీ గ్యాస్ కొరత పుణ్యమా అని గత కొన్ని రోజుల నుంచి సమోసా కూడా నగర వాసులకు దూరమయింది. ఎక్కువగా ఆలూ, ఉల్లి సమోసాలకు హైదరాబాద్ లో గిరాకీ ఎక్కువ. నాన్ వెజ్ ప్రియులను ఆకట్టుకునేందుకు చికెన్ సమోసా కూడా ఇటీవల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. సమోసా రగడ, పావు భాజీ, పానీపూరీ, వడా పావ్, మోమోస్, పిజ్జా, బర్గర్ వంటివి నగరవాసులకు దూరమయ్యాయి.
స్వీట్ దుకాణాలు కూడా...
ఇక స్వీట్ దుకాణాలు కూడా దాదాపుగా మూతబడే స్థితికి చేరుకుంటున్నాయి. రుచికరమైన స్వీట్లు, కారప్పూస, కారబ్బూంది, అటుకులు వంటివి తయారు చేయాలంటే గ్యాస్ వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రముఖ స్వీట్ షాపుల్లో ఇప్పుడు ఉన్న సరుకును మాత్రమే విక్రయిస్తున్నారు. వాటిని కూడా ధరలు పెంచారు. మరొకవైపు బొబ్బట్లను లైవ్ లో తయారు చేసే చోట కూడా అవి కనిపించకుండా పోయాయి. మొత్తం మీద గ్యాస్ కొరతతో హైదరాబాద్ వాసులు అనేక రుచులకు దూరమయ్యారనే చెప్పాలి. అనేకమంది ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.