హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ప్రయాణ సమయం ఇంత తగ్గనుందా?
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణకు నిధులు కేటాయించనుంది. నవంబరు నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ.10,391 కోట్లతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని ప్రాధమికంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 162 హెక్టార్ల భూసేకరణకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. విజయవాడ - హైదరాబాద్ ల మధ్య 231 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు పూర్తయితే చాలా సమయం ఆదా అవుతుంది.
వేలాది వాహనాలు...
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఆరు వరుసలుగా విస్తరణ పనులు చేపట్టాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉందిద. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను నవంబర్ మొదటి లేదా రెండో వారంలోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను ముగించి, వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈనిర్మాణం పూర్తయితే దాదాపు గంటన్నర నుంచి గంట ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
విజయవాడ దుర్గగుడి వరకూ...
తెలంగాణలోని దండుమల్కాపూర్ సమీపంలోని ఆంథోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.10,391.53 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ వంటి ఇతర అవసరాలకు రూ.3,616.06 కోట్లు కేటాయించారు. దీని ప్రకారం కిలోమీటర్ నిర్మాణానికి సగటున రూ.44.92 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా రహదారి వెంట పలు కీలక నిర్మాణాలు చేపట్టనున్నారు. 33 మేజర్ జంక్షన్లు, 105 మైనర్ జంక్షన్లతో పాటు 4 కొత్త ఫ్లైఓవర్లు, 17 వెహికల్ అండర్‌పాస్‌ల తో పాటు ఓవర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఏపీ పరిధిలో రెండు కొత్త బైపాస్‌లను కూడా నిర్మించనుండగా, మొత్తం ప్రాజెక్టులో 22.5 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ విధానంలో రహదారిని అభివృద్ధి చేయనున్నారు. డీపీఆర్ పూర్తయతే వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టే అవకాశాలున్నాయి. నిజంగా ఈ రహదారి విస్తరణతో మరింత వెసులుబాటుకు రెండు రాష్ట్రాల ప్రజలకు కలుగుతుంది.