Telangana : రెండేళ్లుగా నన్ను వ్యక్తిత్వ హననం చేస్తున్నారు
రాజకీయ ఆరోపణల డైవర్షన్ నేపథ్యంలోనే ఈ సిట్ నోటీసులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
రాజకీయ ఆరోపణల డైవర్షన్ నేపథ్యంలోనే ఈ సిట్ నోటీసులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము బొగ్గుగనులకు సంబంధించి ముఖ్యమంత్రి బావమరిదిపై ఆరోపణలు చేయడం వల్లనే ఫోన్ ట్యాపింగ్ కేసులో తమకు సిట్ నోటీసులు ఇచ్చారని అన్నారు. ఇటీవల హరీశ్ రావును విచారించిన సిట్ అధికారులు, నేడు తనను పిలిచి విచారణ చేస్తామంటున్నారని అన్నారు. విచారణకు తాము భయపడేది లేదని తెలిపారు. పరిపాలన చేత కాక,హామీలు అమలు చేయలేక ఇలా అనేక డ్రామాలకు ప్రభుత్వం తెరతీస్తుందని కేటీఆర్ అన్నారు.
కేసుల పేరుతో డ్రామాలు...
కొన్ని రోజులు కాళేశ్వరం, మరికొన్ని రోజులు పశువుల దాణా కుంభకోణమని, మరికొన్ని రోజులు ఫార్ములా కారు రేసింగ్ అని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అని డ్రామాలాడుతున్నారని అన్నారు. గత రెండేళ్ల నుంచి తనపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్స్ తో సంబంధాలుంటాయని తప్పుడు ప్రచారం చేస్తూ తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ఆవేదనకు గురి చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఏ తప్పు చేయలేదని అన్నారు. డైలీ సీరియల్ లాగా ఫోన్ ట్యాపింగ్ కేసును నడుపుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.