Hyderabad : హైదరాబాద్ సగం ఖాళీ అయిందిగా?
సంక్రాంతి పండగకు నగరం బోసిపోయింది. దాదాపు సగం హైదరబాద్ ఖాళీ అయింది
సంక్రాంతి పండగకు నగరం బోసిపోయింది. దాదాపు సగం హైదరబాద్ ఖాళీ అయింది. ట్రాఫిక్ పెద్దగా లేదు. సౌండ్ అంతగా వినిపించడం లేదు. వాహనాల రద్దీ రహదారులపై లేదు. ఇదీ ఈరోజు హైదరాబాద్ లో పరిస్థితి. ఈ సారి సంక్రాంతి పండగ సండే టు సండే వరసగా సెలవులు రావడంతో పెద్దయెత్తున జనం సొంతూళ్లకు తరలి వెళ్లారు. గత శుక్ర,శని, ఆదివారాల్లో దాదాపు మూడు లక్షలకు పైగానే వాహనాలు టోల్ గేట్లు దాటినట్లు లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. కిక్కిరిసిపోయి నిత్యం కనిపించే మెట్రో రైళ్లు కూడా ఖాళీగా కదులుతున్నాయి.
సొంతూళ్లలోనే...
ప్రధానంగా హైదరాబాద్ లో నివసించే వారు ఎక్కువగా తమ సొంతూళ్లలోనే సంక్రాంతి పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది మరీ ఎక్కువ సెలవులు రావడంతో గత శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లిన వారు ఈ ఆదివారం వరకూ సొంతూళ్లలో బంధుమిత్రుల మధ్య గడిపే అవకాశం లభించింది. హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం వచ్చిన వారు సొంతూళ్లకు వెళ్లి తమ బంధుమిత్రులను కలుసుకుని ఆనందంగా గడిపే సమయాన్ని వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. అందుకే సంక్రాంతి పండగకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులు.. లేకుంటే సొంత వాహనాల్లో అయినా బయలుదేరి వెళుతుంటారు.
వరస సెలవులతో...
సంక్రాంత్రి పండగ గ్రామీణ వాతావరణంలోనే జరుపుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నగరంలో గ్రామీణ వాతావరణం సృష్టించేందుకు కొందరు తంటాలుపడుతున్నా అది కృతకంగానే ఉంటుంది. అంతే తప్ప సొంతూళ్లకు వెళ్లి.. ప్రయాణం చేస్తేనే అందులో మజా ఉంటుంది. తమ గ్రామాన్ని తనివి తీరా చూసుకుని మురిసిపోయే సందర్భమిది. తాము చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో తిరగడం అంటే పెరిగిన వయసు మర్చిపోయి మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తాయి. పెద్దల నుంచి పిల్లల వరకూ కుటుంబాలన్నీ కలసి చేసుకునే పండగ కావడంతో అందరూ పల్లెబాట పట్టారు. కోడిపందేలు.. బండ లాగుడు పోటీలు.. కబడ్డీ ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సందడిని మిస్ అవుతామని భావించి అందరూ ఇంటి బాట పడతారు. అందుకే ఇప్పుడు నగరం నిశ్శబ్దంగా మారింది.