ఫ్యాక్ట్ చెక్: గృహ అవసరాల కోసం 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీ సింలిండర్ ని ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టం చేసింది
గృహ అవసరాల కోసం 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీ సింలిండర్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. హార్మోస్ జల సంధి మూసివేత కారణంగా ఇంధనం సరఫరా చేసే నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయి. భారత దేశంలో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ నిలువలు సరిపడా ఉన్నప్పటికీ, ఎల్పిజి గ్యాస్ విషయంలో మాత్రం తీవ్రమైన కొరత కనిపిస్తోంది. దీంతో హార్మోజ్ జల సంధి నుంచి నౌకలను కదిలించేలా చేయాలని అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా గల్ఫ్ నుంచి వచ్చే నౌకలను హార్మోజ్ జల సంధి నుంచి వెళ్ళనివ్వకుండా ఇరాన్ ఆంక్షలను విధించింది. ఇది మొత్తం ప్రపంచ ఇంధన మార్కెట్ పైన ప్రభావం చూపించింది. భారతదేశం ప్రస్తుతం దౌత్య మార్గం ద్వారా ఇరాన్ తో సంప్రదింపులు ప్రారంభించడంతో, ప్రస్తుతం భారత దేశ అవసరాలకు సంబంధించిన నౌకలను ఇరాన్ హార్మోజ్ జలసంది దాటేందుకు అనుమతి అందిస్తోంది. మరికొన్ని నౌకలు సైతం భారత్ చేరుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏర్పడిన ఈ గ్యాస్ కొరత నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇప్పటికే గల్ఫ్ మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సహజవాయువు దిగుమతి చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మొత్తం 40 దేశాల నుంచి ఈ గ్యాస్ ను దిగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఇలాంటి సమయంలో సిలిండర్ బరువు తగ్గించే యోచనలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి సంస్థలు ఇకపై గృహ అవసరాలకు 10 కేజీల ఎల్‌పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. ఇలా చేయడం ద్వారా గృహ అవసరాలకు ఎక్కువ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం నుంచి ఉపశమనం పొందవచ్చని చమురు కంపెనీలు భావిస్తున్నాయని ఆ కథనాల్లో తెలిపారు.
మీడియా కథనాలకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము భారతదేశంలోని పలు గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను పరిశీలించాం. ఎక్కడా కూడా 10 కిలోల గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటన కనిపించలేదు.
వైరల్ అవుతున్న వాదనలో నిజాలు తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేశాం. అయితే వైరల్ అవుతున్న వాదనను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఎల్‌పీజీ సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు.
సుజాత శర్మ మార్చి 23, 2026న మాట్లాడుతూ “గత మూడు వారాల్లో సుమారు 3.5 లక్షల గృహ, వాణిజ్య పీఎన్‌జీ (PNG) కనెక్షన్లు యాక్టివేట్ చేశాం. ఎల్పీజీ సరఫరా ఇప్పటికీ ప్రజల్లో ఆందోళనకరంగానే ఉంది, కానీ ఎల్పీజీ పంపిణీ కేంద్రాలలో ఎలాంటి కొరత లేదు. ఎల్పీజీ కోసం భయాందోళనలతో చేసే బుకింగ్‌లు తగ్గాయి, డెలివరీ సాధారణంగా ఉంది.” అని అన్నారు.
“వాణిజ్య ఎల్పీజీ విషయానికి వస్తే, ఇప్పుడు సుమారు 50% వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆధీనంలో ఉన్నాయి. ఈ కేటాయింపులో రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్, పాడి యూనిట్లు, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలచే నడపబడే రాయితీ క్యాంటీన్లు లేదా ఆహార కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్‌లు, వలస కార్మికుల కోసం ఐదు కేజీల ఎఫ్‌టిఎల్ (FTL)ను చేర్చాలని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది” అని తెలిపారు. “ఇప్పటివరకు, సుమారు 20 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వాణిజ్య ఎల్పీజీని కేటాయించాయి, సుమారు 15 వేల 800 టన్నుల వాణిజ్య ఎల్పీజీని తీసుకువెళ్లారు.” అని స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా స్పష్టం చేశాయి. ఎల్‌పీజీ సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసిందంటూ మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీ.. అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన కేంద్రం
Claimed By : Media Outlets
Fact Check : Unknown