ఫ్యాక్ట్ చెక్: 500 రూపాయలకే గోబర్ గ్యాస్ తో తయారైన సిలిండర్లను ప్రజల కోసం పంపిణీ చేయడం లేదు
గోబర్ గ్యాస్ తో తయారైన సిలిండర్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు
భారతదేశంలో LPG సిలిండర్లు సరఫరా సక్రమంగా జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) ఆధారిత డెలివరీలు సుమారు 92 శాతం వరకు పెరిగాయని కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇకపై 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
ఇంతలో 500 రూపాయలకే ఆవు పేడతో గ్యాస్ సిలిండర్లను తీసుకొచ్చారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన పోస్టులను ఇక్కడ చూడొచ్చు
"కేవలం ₹500కే గ్యాస్ సిలిండర్: ఉత్తరాఖండ్ సోదరుల 'ఆవు పేడ' అద్భుతం!
వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు సోదరులు సామాన్యుడి కష్టాలను తీర్చే ఒక వినూత్న ఆవిష్కరణను తెరపైకి తెచ్చారు. ఆవు పేడను ఉపయోగించి వారు తయారు చేసిన 'పోర్టబుల్ బయోగ్యాస్ సిలిండర్లు' నేడు పర్యావరణ పరిరక్షణలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి.
₹500లతో 20 రోజుల వంట!
సాధారణ గ్యాస్ సిలిండర్లతో పోలిస్తే ఇది అత్యంత చౌకైనది మరియు సురక్షితమైనది.
* సామర్థ్యం: ఒక్కో సిలిండర్‌లో 18 కిలోల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉంటుంది.
* ప్రయోజనం: ఒక మధ్యతరగతి కుటుంబానికి సుమారు 15 నుండి 20 రోజుల పాటు వంట అవసరాలకు ఇది నిరంతరాయంగా సరిపోతుంది.
* ధర: కేవలం ₹500లకే లభించే ఈ సిలిండర్ గ్రామీణ కుటుంబాల ఆర్థిక భారాన్ని భారీగా తగ్గిస్తోంది.
వ్యర్థం నుంచి విద్యుత్.. కాలుష్యానికి చెక్!
సాధారణంగా ఆవు పేడ వాతావరణంలో కలిసిపోయినప్పుడు హానికరమైన మీథేన్ వాయువు విడుదలవుతుంది.
* వినూత్న ఆలోచన: ఈ సోదరులు ఆ మీథేన్‌ను వాతావరణంలో కలవకుండా బంధించి, దానిని ఇంధనంగా మార్చారు.
* పర్యావరణ హితం: ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ నుండి మహిళల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది.
స్థానిక వనరులే.. ప్రపంచస్థాయి పరిష్కారాలు!
ఎటువంటి భారీ యంత్రాలు, సంక్లిష్టమైన సాంకేతికత లేకపోయినా.. మన చుట్టూ ఉండే వనరులతోనే దేశం ఎదుర్కొంటున్న ఇంధన సమస్యకు వీరు పరిష్కారం చూపారు. పట్టుదల ఉంటే వ్యర్థాలను కూడా విలువైన సంపదగా మార్చవచ్చని ఈ సోదరులు నిరూపించారు.
ప్రకృతిని ప్రేమిస్తూ.. పదిమందికి మేలు చేసే ఇటువంటి ఆవిష్కరణలే రేపటి 'స్వచ్ఛ భారత్'కు అసలైన పునాదులు!" అంటూ ఆ పోస్టుల్లో తెలిపారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు
https://archive.ph/xvDdP
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఉత్తరాఖండ్‌కు చెందిన సోదరులు కేవలం ₹500కే 18 కిలోల వంటగ్యాస్‌ను ఉత్పత్తి చేసే పర్యావరణ అనుకూల బయోగ్యాస్ సిలిండర్‌ను అభివృద్ధి చేశారని, వైరల్ వీడియోలోని దృశ్యాలను జతచేస్తూ పలు ప్రధాన మీడియా సంస్థలు కూడా వార్తా కథనాలను ప్రచురించాయి.
వైరల్ వీడియోను, సిలిండర్ల మీద ఉన్న అక్షరాలను నిశితంగా పరిశీలిస్తే XTRATEJ అని ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఒక విభాగమైన ఇండేన్
కుకింగ్ గ్యాస్ సంస్థ నుండి వచ్చిన ఓ ఎల్.పి.జి ఉత్పత్తి ఇది.
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ XTRATEJ కు సంబంధించిన వివరాలు మాకు లభించాయి. వివిధ వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దీన్ని తీసుకుని వచ్చారు. ఇండేన్ XTRATEJ కేవలం పారిశ్రామిక, వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే తీసుకుని వచ్చారు. ఇది గృహ వినియోగానికి ఉద్దేశించలేదు. వాస్తవానికి, IOCL వెబ్‌సైట్‌లోని ఇండేన్ గ్యాస్ పేజీలో ఇలాంటి ఊదా రంగు సిలిండర్ల చిత్రాలు ఉన్నాయి.
https://iocl.com/indane-
ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు సోదరులు కేవలం ₹500కే 18 కిలోల వంటగ్యాస్‌ను ఉత్పత్తి చేసే బయోగ్యాస్ సిలిండర్‌ను అభివృద్ధి చేశారని చెప్పారు. ఒకవేళ ఇలాంటి ఆవిష్కరణ ఉత్తరాఖండ్‌లో జరిగి ఉంటే, విశ్వసనీయ స్థానిక మీడియా సంస్థలు దీని గురించి విస్తృతంగా ప్రచురించి ఉండేవి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Users
Fact Check : Unknown