Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. ఇక వేసవి వరకూ ఇంతేనా?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత శుక్రవారం మొదలయిన రద్దీ ఇంకా తగ్గలేదు. అదే రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాల కొరత లేకుండా చూసుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
ఆన్ లైన్ శ్రీవారి వస్త్రాలు...
మార్చి 2వ తేదీ నుంచి 9వ తేదీ ఆన్ లైన్ లో శ్రీవారి వస్త్రాలు ఈ - వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి, ఉపయోగించినవి , పాక్షికంగా దెబ్బతిన్నవి లాట్ల ఆర్ట్ సిల్క్ చీరల, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు మరియు ఆర్డినరీ చీరలు ఆన్ లైన్ లో ద్వారా ఈ - వేలం వేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,035 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,090 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం4.48 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు.