Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ తిరుమలలో ఏ మాత్రం తగ్గలేదు. సహజంగా మంగళవారం నుంచి భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అయితే ఈ వారం మాత్రం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక వచ్చేది ఎండా కాలం కావడంతో ముందుగానే శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుందామని ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్నారని చెబుతన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి...
తిరుమలకు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని చెబుతున్నారు. మరొకవైపు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది స్వామి వారి హుండీ ఆదాయం అధికంగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వసతి గృహాల కొరత కొంత ఇబ్బందిగా మారింది. అలాగే భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
పదిహేను కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,983 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,900 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.