Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. మూడు రోజులు హెవీ రష్
తిరుమలలో భక్తుల రద్దీ కొంత పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొంత పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సహజంగా శుక్రవారం నుంచి మొదలయిన రద్దీ సోమవారం లేదా మంగళవారం వరకూ కొనసాగుతుంది. అందుకే నేడు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమలకు భక్తుల రద్దీ అంతగా లేదు. అయితే హుండీ ఆదాయం మాత్రం గణనీయంగానే వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
శనివారం ఎక్కువ మంది...
తిరుమలకు వచ్చేభక్తులు శనివారం తిరుమల కొండపైన ఉండేలా ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటారు. ఇందుకు ప్రధాన కారణం శ్రీనివాసుడికి శనివారం అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆరోజు తిరుమలలో ఉండేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే శుక్రవారం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది.
మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,642 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,887 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.