Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి గుడ్ న్యూస్... సులువుగానే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది. గత నాలుగు రోజుల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నెల రోజులు దాటుతుండటంతో ప్రయాణాలను చాలా మంది మానుకున్నారు. బయటకు వెళ్లి ఆహారం కోసం ఇబ్బంది పడతామన్న ఆందోళనతో తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తిరుమలపై కూడా యుద్ధం ప్రభావం పడిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వేసవి రద్దీ మొదలు కాలేదు...
సాధారణంగా వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జూన్ నుంచి తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. అందుకే ముందుగానే స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు చేరుకుంటారు. కానీ గత నాలుగైదు రోజుల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. యుద్ధం ప్రభావంతో ఆధ్యాత్మిక పర్యటనలను కూడా చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. అందులో భాగంగానే తిరుమలకు భక్తుల రాక తగ్గిందని అంటున్నారు. అదే సమయంలో రేపటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏడు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నేడు పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లున్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. బుధవారం స్వామి వారిని 69,649 మంది భక్తులు దర్శించుకున్నారు, 24 ,644 మంది భక్తులు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 .85 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.