Tirumala : తిరుమలలో తగ్గని రద్దీ .. నేడు కూడా రష్ పెరగడానికి కారణమిదే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ నిత్యం అలాగే ఉంటుంది. ఏ రోజు కూడా భక్తులు తక్కువ సంఖ్యలో రావడం ఈ మధ్య కాలంలో జరగలేదు. అందుకే స్వామి వారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గతానికి భిన్నంగా ఇప్పడు తిరుమల దివ్యక్షేత్రం నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా మారింది. అయితే భక్తులు రోజుకు ఎనభై వవేల మందికి పైగానే వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
సీజన్ తో సంబంధం లేకుండా...
గతంలో కొన్ని సీజన్ లో మాత్రమే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. మరొకవైపు శని, ఆదివారాలు, పండగ వేళల్లో మాత్రం తిరుమల కిటకిట లాడేది. కానీ ఇప్పుడు సెలవులు, పండగలతో సంబంధం లేకుండా ఆన్ లైన్ లో తమకు టిక్కెట్లు ఎప్పుడు దొరికితే అప్పుడు వెంటనే రైలు, బస్సు, సొంత వాహనాల్లో బయలుదేరి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు నిత్యం చేరుకుంటారు. దగ్గరగా ఉండే జిల్లాల వారు కూడా వచ్చి తిరుమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.నిన్న ఆదివారం మహా శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.80,502 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.24,608 మంది భక్తులు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 . 74 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.