Tirumala : తిరుమలకు ఇక పెరగనున్న రద్దీ... రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ నేడు పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ నేడు పెరిగింది. తిరుమలలో నిన్నటి వరకూ కొంత తగ్గినట్లు కనిపించిన భక్తుల రద్దీ నేడు మళ్లీ పెరిగింది. భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యలో తిరుమలకు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎక్కువ కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రేపటి నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని, సోమవారం వరకూ ఈ రద్దీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
శుభకార్యాల ఎఫెక్ట్...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ముందుగా బుక్ చేసుకున్న వారితో పాటు మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు చేరుకుంటున్నారు. ఇటీవల కొన్ని ప్రవేశ పరీక్ష ఫలితాలు రావడంతో అందులో విజేతలు కూడా ఎక్కువ మంది మొక్కులు చెల్లించుకోవడానికి తరలి వస్తున్నారు. మరొకవైపు శుభకార్యాలు కూడా ప్రారంభం కానుండటంతో ఇక తిరుమలలో భక్తుల రద్దీ గతంలో కంటే ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.