Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఇలా వెళితే మీకు దర్శనం కష్టమే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. శుక్రవారం మొదలయిన రద్దీ ప్రతి వారం సోమవారం వరకూ కొనసాగుతుంది. అందుకే ఈరోజు సోమవారమయినప్పటికీ అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు మొదలు కావడంతో కొంత రద్దీ తగ్గుతుందని భావించినప్పటికీ, వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. శుక్ర, శని, ఆదివారాలు ఎక్కువ మంది భక్తులు వస్తుండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు కూడా రద్దు చేయనున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
వేసవి రద్దీని తట్టుకునేందుకు...
వేసవి రద్దీని తట్టుకునేందుకు ముందు నుంచి టీటీడీ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. రోజుకు ఎనభై వేల మందికిపైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా అంచనాలున్నాయి. అందులోనూ వేసవి సెలవులు, పరీక్షలు పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను కూడా స్వీకరించే అవకాశముండదు. ఈరోజు మే నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు అంగప్రదిక్షణ, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను, మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్ధులు, వికలాంగుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది హేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయంపడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,506 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,049 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.20 కోట్లు వచ్చింది.