Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా... అయితే మీకోసమే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు. సాధారణంగా శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మొదలయి సోమవారం వరకూ కొనసాగుతుంది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం కారణంగా భక్తుల రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
కోటి విరాళం ఇచ్చేవారికి...
తిరుమల శ్రీవారికి కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది ప్రత్యేక సౌకర్యాలను టిటిడి కల్పిస్తోంది. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ మరియు 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట - 1, రవికే - 1, మహా ప్రసాదం ప్యాకెట్లు - 10, ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు.
విరాళాలు ఈ ట్రస్ట్ లకు...
వీటితో పాటుగా మూడు వేల రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం మూడు రోజులు కల్పిస్తారు. అంతేకాక జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు. దాతలు టిటిడి ట్రస్ట్ లకు విరాళాలు ఇవ్వవచ్చు. కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చు.దాతలు టిటిడి అధికారిక వెబ్ సైట్ అయిన ttddevasthanams.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయవచ్చు.
ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్ లోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్ లోనే భక్తుల రద్దీ ఉంది. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,136 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో23,255 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.79 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.