Tirumala : తిరుమలకు వెళ్లే వారికి నేడు గుడ్ న్యూస్.. సులువు దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తులు పెద్దగా తిరుమలకు రాలేదు. మరొకవైపు ఎండలు, వానలు ఎక్కువగా ఉండటంతో పాటు పశ్చిమాసియా యుద్ధం ప్రభావం కూడా తిరుమలపై పడిందని చెబుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు రెండు రోజుల పాటు అక్కడే ఉండి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. వసతి గృహాలు దొరకడం కూడా సులువుగా మారింది. స్వామి వారిని సులువుగా దర్శించుకుంటున్నారు.
యుద్ధం ప్రభావంతో...
చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను తిరుగుతుంటారు. ప్రయివేటు హోటళ్లు గ్యాస్ కొరతతో అధిక ధరలు తీసుకోవడమే కాకుండా కొన్ని హోటల్స్ ను మూసివేయడం కూడా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణమని చెబుతున్నారు. మరొకవైపు తిరిగి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వచ్చిన భక్తులు శనివారం కూడా తిరుమల కొండపైనే ఉండి స్వామి వారిని దర్శించుకుంటుంటారు.
ఐదు కంపార్ట్ మెంట్లలోనే...
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,232 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 23,288 గా ఉంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.