Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా.. దర్శనం ఎన్ని గంటలంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు తిరుమలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. శనివారం కావడంతో చుట్టు పక్కల జిల్లాల వారు కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకోనున్నారు.దీంతో తిరుమలలో శనివారం భక్తులతో కిటకిటలాడుతుందని, శనివారం స్వామి వారిని దర్శించుకుంటే శుభప్రదమని నమ్ముతారని, దీంతో పాటు సెలవులు కూడా రద్దీ పెరగడానికి కారణమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
భక్తుల రద్దీ పెరగడంతో...
తిరుమలకు వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు కంపార్ట్ మెంట్లలో ఇబ్బందులు పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక శివరాత్రి కూడా ఉండటంతో స్వామి వారి దర్శనానికి కాళహస్తికి వచ్చే వారు తిరుమలకు కూడా వచ్చి దేవుడిని దర్శించుకుని వెళతారంటున్నారు. ఇటీవల కాలంలో భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
పదిహేడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,222 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,882మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.