Tirumala : వేసవి కంటే ముందుగానే తిరుమలలో భక్తుల రద్దీ పెరగడానికి రీజన్ ఇదేనట?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. ఇటీవల కాలంలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. పరీక్షలు మొదలవుతుండటంతో భక్తుల రద్దీ తగ్గుతుందని భావించినప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. సోమవారం నుంచి నేటి వరకూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇక రేపటి నుంచి ఆదివారం వరకూ మరింతగా భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందు నుంచే చేస్తున్నామని తెలిపారు.
వేసవి కంటే ముందుగానే...
తిరుమలకు వచ్చే భక్తులు గతంలో కేవలం మొక్కులు చెల్లించుకోవడానికి మాత్రమే ఏడాదికి ఒకసారి వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్వామి వారిని దర్శించుకుంటే తమ కష్టాలు తొలిగిపోతాయని, ప్రయాణాలను కూడా లెక్క చేయకుండా ఎప్పుడంటే అప్పుడు బయలుదేరి తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే అప్పుడు సిఫార్సు లేఖలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేసే అవకాశముందని, అందువల్ల స్వామి వారిని ముందుగానే దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,652 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,758 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.31 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.