ఎట్టకేలకు చిక్కిన చెడ్డీగ్యాంగ్..నగదు, నగలు స్వాధీనం

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్

Update: 2021-12-18 06:26 GMT

బెజవాడ వాసులతో పాటు.. పోలీసులను సైతం ముప్పతిప్పలు పెట్టిన చెడ్డీగ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కొద్దిరోజులుగా ఈ చెడ్డీగ్యాంగ్ బెజవాడతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అర్థరాత్రి అయితే చాలు.. భయంభయంగా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురుచూసే పరిస్థితి. ఎవరు తలుపుతట్టినా చెడ్డీగ్యాంగ్ వచ్చిందేమో అని కంగారు. ఇలా చాలామంది చెడ్డీగ్యాంగ్ ఆగడాలతో బెంబేలెత్తిపోయారు. ఆఖరికి ఆ గ్యాంగ్ ఆట కట్టించారు విజయవాడ పోలీసులు. చెడ్డీగ్యాంగ్ కోసం గుజరాత్ లో నిఘా వేసిన నగర పోలీసులు.. ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి, నగరానికి తీసుకొచ్చినట్లు సమాచారం. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువాలను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చెడ్డీగ్యాంగ్ లో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. ఇంకా ఏడుగురు సభ్యులు పరారీలో ఉండటంతో.. మరో పోలీస్ బృందం గుజరాత్ లోనే ఉండి వారికోసం గాలింపు చర్యలు చేపట్టింది.


గుజరాత్ నుంచి విజయవాడకు వచ్చి..

అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల వద్ద నుంచి రూ.20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 22వ తేదీన ఒక పెళ్లి విందులో కలుసుకున్న 10 సభ్యులు చెడ్డీగ్యాంగ్ గా ఏర్పడి దక్షిణాది రాష్ట్రాల్లో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అనుకున్నదే తడవు.. గుజరాత్ లో రైలెక్కి చెన్నైకి చేరుకున్న చెడ్డీగ్యాంగ్.. అక్కడి నుంచి నవంబర్ 28న విజయవాడకు వచ్చింది. మొత్తం 10 మంది ఉండగా.. 5 మంది ఒక బృందంగా.. మరో 5 మంది ఇంకొక బృందంగా విడిపోయి దొంగతనాలకు పాల్పడి, తిరిగి గుజరాత్ కు వెళ్లిపోయినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారని, వారి ద్వారా మిగతా నిందితుల సమాచారాన్ని రాబట్టి వారిని కూడా పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.


Tags:    

Similar News