హైదరాబాద్ నర్స్‌కు మ్యాట్రిమోని మోసం… ₹7.76 లక్షలు దోచిన నకిలీ యూకే డాక్టర్
ఎయిర్‌పోర్టు, పన్నులు, కరెన్సీ మార్పిడి పేర్లతో డబ్బు వసూలు సైబర్ క్రైమ్ యూనిట్‌లో ఫిర్యాదు…
నగరంలోని చింతల్‌కు చెందిన 48 ఏళ్ల నర్స్ మ్యాట్రిమోని మోసానికి గురై ₹7,76,930 కోల్పోయింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పిన వ్యక్తి పెళ్లి పేరుతో ఆమెను నమ్మించి డబ్బు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం నర్స్ 2026 జనవరిలో మ్యాట్రిమోని మొబైల్ యాప్‌లో తన ప్రొఫైల్ నమోదు చేసింది. ఫిబ్రవరి 17న ఓ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా సంప్రదించిన వ్యక్తి తన పేరు కుమార్ వర్మ అని చెప్పి పెళ్లి విషయమై ఆసక్తి వ్యక్తం చేశాడు.
తాను యూకేలో డాక్టర్‌గా పని చేస్తున్నానని, మ్యాట్రిమోని వేదికలో ఆమె ప్రొఫైల్ నచ్చిందని చెప్పాడు. విదేశాల్లో ఉంటాడని కారణంగా ఉషారాణి మొదట ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. త్వరలోనే భారత్‌కు వస్తానని చెప్పి ఆమెను ఒప్పించాడని పోలీసులు వెల్లడించారు.
ఎయిర్‌పోర్టు సమస్యలు...డబ్బు కావాలి
ఫిర్యాదు ప్రకారం ఫిబ్రవరి 25న తన కుమారుడితో పాటు బంగారం తీసుకుని భారత్‌కు వస్తున్నానని నిందితుడు తెలిపాడు. నమ్మకం కలిగించేందుకు ఎయిర్‌పోర్టు, విమానంలో తీసిన ఫోటోలు కూడా పంపించాడు.
అదే రోజు మరో నంబర్ నుంచి మళ్లీ సంప్రదించి ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులు తనను ఆపారని చెప్పాడు. అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన ‘యెల్లో కార్డు’ లేకపోవడంతో సమస్య వచ్చిందని చెప్పి దాన్ని పొందేందుకు ₹42,000 పంపాలని కోరాడు. అతని మాటలు నమ్మిన ఉషారాణి ఇచ్చిన బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేసింది.
పలుమార్లు డబ్బు బదిలీ
ఆ తరువాత కరెన్సీ మార్పిడి, బంగారంపై పన్నులు చెల్లించాల్సి ఉందని నిందితుడు మరిన్ని డబ్బులు అడిగాడు. పౌండ్లను రూపాయిలకు మార్చేందుకు ₹2,18,000 పంపించింది. తన వద్ద ఉన్న ₹74 లక్షల విలువైన బంగారంపై పన్నుల పేరుతో మరో ₹1,21,500 తీసుకున్నాడు.
ఎయిర్‌పోర్టు ప్రక్రియలో ఉండే సమయంలో వసతి ఖర్చుల పేరుతో మరో ₹68,750 కూడా పంపాలని చెప్పాడు. ఇలా మీ సేవా లావాదేవీల ద్వారా మొత్తం ₹7,76,930 నిందితుడు చెప్పిన ఖాతాలకు ఉషారాణి పంపించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఉషారాణి సైబర్ క్రైమ్ యూనిట్‌లో ఫిర్యాదు చేసింది. కుమార్ వర్మ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.