వాట్సాప్ పార్ట్‌టైమ్ జాబ్ మోసం… నర్సుకు ₹9 లక్షల నష్టం
వాట్సాప్ తో వల “వీఐపీ టాస్క్” పేరుతో భారీ పెట్టుబడులు
వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో మోసగాళ్లు వల వేసి, ఈసీఐఎల్‌కు చెందిన 26 ఏళ్ల నర్సును ₹9 లక్షలు మోసం చేశారు. ఈ ఘటనపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
వాట్సాప్ తో వల
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాప్రా ప్రాంతంలో నివసిస్తున్న యువతి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మార్చి 1, 2026న ఆమెకు ఓ అంతర్జాతీయ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది.
“నిహారిక” అని పరిచయం చేసుకున్న వ్యక్తి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉత్పత్తుల ప్రచారం చేసే ఈ–కామర్స్ కంపెనీతో తాను పనిచేస్తున్నానని చెప్పింది. ఆన్‌లైన్‌లో చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే 20–40 శాతం కమీషన్ ఇస్తామని పార్ట్‌టైమ్ ఉద్యోగం ఆఫర్ చేసింది.
దాంతో బాధితురాలిని “డైలీ డేటా టాస్క్” పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. కొన్ని పనులు చేసి స్క్రీన్‌షాట్‌లు పంపాలని సూచించారు. మొదటి మూడు పనులు పూర్తి చేసిన తర్వాత ఆమె ఖాతాలో ₹300 జమ చేశారు. దీంతో పని నిజమని ఆమె నమ్మింది.
“వీఐపీ టాస్క్” పేరుతో భారీ పెట్టుబడులు
తర్వాత “న్యూకమర్ టాస్క్” పేరుతో ₹2,000 చెల్లిస్తే ₹3,000 వస్తాయని చెప్పారు. ఆమె freelan9.space వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచి మొత్తం ₹1,600 వరకు విత్ డ్రా చేసుకుంది.
తరువాత “వీఐపీ టాస్క్” పేరుతో ₹4,000 పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఆ తర్వాత పిన్‌కు సంబంధించిన పనులు పూర్తి చేస్తే డబ్బు తీసుకోవచ్చని చెప్పి మరిన్ని చెల్లింపులు చేయించారు.
కొద్ది రోజులకు ఖాతా డియాక్టివేట్ అయిందని చెప్పి మళ్లీ యాక్టివ్ చేయాలంటే ₹1 లక్ష పంపాలని కోరారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు ఆ మొత్తాన్ని పంపింది. తర్వాత మరోసారి పనులు పూర్తి చేస్తే మొత్తం సంపాదించిన డబ్బు తీసుకోవచ్చని చెప్పి ₹2 లక్షలు,మరో మారు ₹2,58,400 పంపించారు.
చివరగా మొత్తం పెట్టుబడిలో 50 శాతం డిపాజిట్ చేస్తే ఖాతా తిరిగి తెరుచుకుంటుందని మోసగాళ్లు చెప్పారు. అప్పుడే తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు మరింత డబ్బు పంపకుండా పోలీసులను ఆశ్రయించింది.
మొత్తంగా ఆమె 12 లావాదేవీల్లో ₹9,05,000 పంపింది. మొదట వచ్చిన ₹1,600 తీసివేస్తే నష్టం ₹9,03,400గా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.