విజయ్ దేవరకొండకు బెదిరింపు ఇచ్చినట్టు రవి ఒప్పుకోలు
2023లో ‘కుషి’ లీక్ సమయంలోనే హెచ్చరిక పంపినట్టు సమాచారం
హైదరాబాద్: ఐబొమ్మ పైరసీ కేసు దర్యాప్తులో ముఖ్యమైన అంశాలు బయటపడ్డాయి. సైట్ నిర్వాహకుడు ఇమండి రవి, 2023లో కుషి సినిమా లీక్ సమయంలో నటుడు విజయ్ దేవరకొండకు బెదిరింపు పంపినట్టు పోలీసులకు చెప్పాడు. ఆయన కస్టడీ ముగియడంతో శనివారం పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.
‘పైరసీలో నేను ఒంటరిగా పనిచేశా’
పరిశీలనలో రవిని విచారించిన అధికారులు, ఆయన చేసిన వ్యాఖ్యలను నమోదు చేశారు. “నా పనులపై ఎవరికీ సంబంధం లేదు. సినిమాల పైరసీకి సంబంధించిన ప్రతిదీ నేను ఒంటరిగా చేసాను,” అని రవి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. డబ్బు కోసం మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఆయన ఒప్పుకున్నట్టు చెప్పారు.
2023 హెచ్చరికను పోలీసులు వెలుగులోకి తెచ్చారు
కుషి సినిమా పైరసీ జరిగినప్పుడు, ఐబొమ్మ ద్వారా విజయ్ దేవరకొండను రవి సవాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఇచ్చిన హెచ్చరికను కూడా ఇప్పుడు బయటపెట్టారు.
“మా విషయాలపై మీరు దృష్టి పెడితే… మేమూ మీపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. మీరు మా మాట పట్టించుకోలేదు. ఏజెన్సీలకు డబ్బు ఇస్తున్నారు. అవి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మా పేరుతో iBommaff.in సైట్ నడుపుతున్నారు. అందుకే మీ కింగ్‌డమ్ సినిమా విడుదల చేస్తాం,” అని రవి చెప్పినట్టు దర్యాప్తులో బయటపడింది.
‘ఐబొమ్మ’–‘బప్పం’ పేర్లకు ఇదే నేపథ్యం
విచారణలో తన డొమైన్ పేర్లపై వచ్చిన ప్రశ్నలకు రవి వివరణ ఇచ్చాడు. విశాఖపట్నంలో సినిమా రిలీజ్ అయితే “బొమ్మ పడింది” అని పలికేవారని, అందుకే “iBomma—నా సినిమా” అనే భావనతో ఆ పేరు పెట్టానని తెలిపాడు. “బప్పం అంటే సుప్రీమ్. నా ప్లాట్‌ఫాం మీద నేను సుప్రీంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ పేరు ఎంచుకున్నా,” అని రవి చెప్పినట్టు పోలీసులు వివరించారు.
డొమైన్ నిర్వహణ, డిజైన్ పనులు కరీబియన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ఉద్యోగులకు అప్పగించినట్టు ఆయన వెల్లడించాడు.
టెలిగ్రామ్, ఓటీటీ నుంచి కంటెంట్ సేకరణ
కొత్తగా విడుదలైన సినిమాలను టెలిగ్రామ్ యాప్స్ నుంచి కొనుగోలు చేసేవాడని, ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే కంటెంట్‌ను రికార్డ్ చేసి సాఫ్ట్‌వేర్‌లతో మార్చి పైరసీ సైట్‌ల్లో పెట్టేవాడని రవి ఒప్పుకున్నట్టు పోలీసులు చెప్పారు.