చైతన్యానందా.. లేక నిత్యానందా? ఇదేందయ్యా సామీ

ఢిల్లీ వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆశ్రమానికి చెందిన స్వామి చైతన్యానంద సరస్వతిపై పదిహేడు మందికి పైగా విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

Update: 2025-09-25 07:00 GMT

ఢిల్లీ వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆశ్రమానికి చెందిన స్వామి చైతన్యానంద సరస్వతిపై పదిహేడు మందికి పైగా విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్వామి చైతన్యానంద పై కేసులు నమోదు చేశారు. ఒక్కసారిగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న చైతన్యనంద స్వామిజీ పై ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆయన పోలీసులు కళ్లు గప్పి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు బృందాలుగా విడిపోయి స్వామి చైతన్యానంద కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న వేధింపుల బాధను ఒక్కసారిగా విద్యార్థులు బయటపెట్టడం సంచలనంగా మారింది.

పదిహేడు మంది విద్యార్థుల ఫిర్యాదుతో...
ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో, ఆయన డైరెక్టర్‌గా పనిచేసిన శారదా ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి శ్రీశృంగేరి మఠం వెంటనే ఆయనను తొలగించింది.వసంత్‌ కుంజ్‌ ఆశ్రమ స్వామిపై పదిహేడు మందిక పైగా మహిళల లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన చైతన్యానంద సరస్వతి అసలు పేరు పార్ధసారధి. స్వామీజీ అవతారమెత్తాడు. ఆథ్యాత్మిక ముసుగులో తన కోర్కెలను తీర్చుకోవాలని స్వామి చైతన్యానంద భావించి పక్కా ప్లాన్ ప్రకారమే ఆశ్రమంలో తనకు అనుచరులను ఏర్పాటు చేశారు. గత పన్నెండేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటూ నిర్వాహకుడిగా పనిచేస్తున్నారు. కొందరు సిబ్బందిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.
పరారీలో స్వామీజీ...
స్వామి చైతన్యానందపై వచ్చిన తొలి ఆరోపణ కాదు. 2009లో డిఫెన్స్‌ కాలనీలో మోసం, వేధింపుల కేసు నమోదైంది. 2016లో వసంత్‌ కుంజ్‌లో మరో మహిళ ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ పాత కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. తాజాగా ఫిర్యాదు చేసిన వారంతా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్న విద్యార్థినులు. ఇప్పటివరకు మప్ఫయి రెండు మంది విద్యార్థినుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. అందులో పదిహేడు మంది ఆయన తమతో అసభ్యంగా ప్రవర్తించారని, అసభ్య సందేశాలు పంపారని, శారీరకంగా వేధించారని పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం చైతన్యానంద సరస్వతి పరారీలో ఉన్నారు. ఆయన చివరిసారిగా ఆగ్రాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
హార్డ్ డిస్క్ ల స్వాధీనం...
విచారణలో ముగ్గురు మహిళా అధ్యాపకులు, నిర్వాహకులు విద్యార్థినులను ఒత్తిడి చేసినట్టు బయటపడింది. వారిని పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. కానీ చైతన్యానంద సరస్వతి పట్టుబడితేనే వారి పూర్తి పాత్ర వెలుగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఆశ్రమంలోని ఆయన గదులను సోదా చేశారు. అక్కడ నుంచి హార్డ్‌డిస్క్‌లు, వీడియో రికార్డర్‌ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. ఆయన ఉపయోగించిన వోల్వో కారు కూడా ఇన్‌స్టిట్యూట్‌ భూగర్భ పార్కింగ్‌లో లభ్యమైంది. దానిని కూడా స్వాధీనం చేసుకున్నారు.మొత్తం మీద స్వామీజీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అప్పి వరకూ గౌరవంతో చూసిన స్థానికులు నోరు వెళ్లబెడుతున్నారు.


Tags:    

Similar News