ఎక్కడ కొడితే సులువుగా చనిపోతారో? గూగుల్ లో తెలుసుకుని మరీ చంపారటగా?
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండు రోజుల క్రితం కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.హత్యలో కీలక ఆధారాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ భార్య పల్లవిపైనే తొలి నుంచ అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే విచారణలో కొన్ని విషయాలు బయటపడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా పోలీసులు రివీల్ చేయకపోయినప్పటికీ హత్య జరిగిన తీరును పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది.
గూగుల్ లో సెర్చ్ చేసి...
అయితే మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురి కావడానికి ముందు ఆయన భార్య పల్లవి గూగుల్ లో హత్య ఎలా చేయాలి? అన్న దానిపై సెర్చ్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. మనిషి త్వరగా చనిపోవడానికి ఏం చేయాలన్న దానిపై కూడా పల్లవి గూగుల్ లో వెతికినట్లు గుర్తించారు. ఎక్కడ నరాలు తెగితే ఒక మనిషి త్వరగా చనిపోతాడన్న దానిపై పల్లవి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్యలో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ భార్య పల్లవితో పాటు కుమార్తె కృతి కూడా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. ఇద్దరూ ఒక స్కెచ్ వేసి మరీ మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను హత్య చేశారన్న కన్ క్లూజన్ కు కర్ణాటక పోలీసులు వచ్చారు.
కుమార్తె ప్రమేయంపై...
అయితే ఇప్పటికే పోలీసుల విచారణలో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను తానే చంపినట్లు ఆయన భార్య పల్లవి అంగీకరించినట్లు తెలిసింది. ఈ విచారణ ముగియక ముందే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్య కేసులో కుమార్తె కృతి ప్రమేయం ఎంత ఉందన్న దానిపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ కుమారుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కుటుంబ తగాదాలతో పాటు భార్య, కుమార్తెతో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ కు పడకపోవడం తో పాటు వారిని బెదిరించి ఇంట్లో బంధించి నందుకే ఈ హత్య చేసినట్లు వారు విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. హత్యకు ముందు ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూపులో కూడా పల్లవి పెట్టిన మెసేజ్ ను పరిశీలించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కంట్లో కారం చల్లి కత్తితో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పల్లవిని న్యాయస్థానం పథ్నాలుగు రోజుల రిమాండ్ కు పంపింది.