ఐఫోన్ తో పాటూ డబ్బుల కట్టలతో ఫోజులిస్తూ వచ్చిన యువకుడు.. ఆ తర్వాత

సోషల్ మీడియాలో డబ్బుల కట్టలతో ఫోటోలు, వీడియోలు పోస్టు చేశాడు. అయితే దీన్ని చూసిన కొందరు.. ఏకంగా ఆ యువకుడిని కిడ్నాప్ చేసేశారు.

Update: 2022-05-03 05:24 GMT

అతడు బాగా డబ్బులు ఉన్న కుటుంబానికి చెందిన వాడు. తన దగ్గర డబ్బు ఉందని ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాడు. సోషల్ మీడియాలో డబ్బుల కట్టలతో ఫోటోలు, వీడియోలు పోస్టు చేశాడు. అయితే దీన్ని చూసిన కొందరు.. ఏకంగా ఆ యువకుడిని కిడ్నాప్ చేసేశారు. అందరికీ షాకింగ్ గా అనిపించే ఘటన ఇది. గత నెలలో పట్టపగలు బాండికుయ్‌లోని కళాశాల విద్యార్థిని కిడ్నాప్ చేసినందుకు ఐదుగురిపై రాజస్థాన్‌లోని దౌసా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని అన్మోల్ అరోరాగా గుర్తించారు, అతన్ని సికర్ జిల్లా నుండి పోలీసులు రక్షించారు. కిడ్నాప్ వెనుక అసలు కారణం బయటకు రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్మోల్ తరచుగా తన సంపద గురించి వీడియోలు పోస్టులు చేసేవాడు. దీంతో అతడు ఒక ధనిక వ్యాపారవేత్త కుమారుడని కిడ్నాపర్‌లను భావించేలా చేసింది.

తన చేతిలో ఐఫోన్ పట్టుకున్న చిత్రాలను పోస్ట్ చేయడం నుండి.. డబ్బులు పట్టుకోవడం వరకూ అన్మోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక చిత్రాలను పోస్ట్ చేశాడు. తన బ్యాంక్ ఖాతాలో ఆరు లక్షల రూపాయలు ఉన్నట్లు నకిలీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. అయితే అతడి పోస్ట్‌లు ఏదో ఒక రోజు తన కిడ్నాప్‌కు దారితీస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఘటన వెనుక సూత్రధారి వివేక్ చతుర్వేదిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా నలుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో ముఠా సభ్యుడు సిద్ధార్థ్ సైనీ అద్దెకు కారు తీసుకుని నంబర్ ప్లేట్ తొలగించి వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల తదుపరి విచారణలో తేలింది.

అన్మోల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లను చూసిన తర్వాత అతన్ని అపహరించాలని ప్లాన్ చేసుకున్నారు. బాధితుడి కుటుంబం నుండి కోటి రూపాయలను కూడా డిమాండ్ చేశారు. అన్మోల్‌ అరోరా కిడ్నాప్‌ కేసులో కింగ్‌పిన్‌ వివేక్‌ చతుర్వేదిని అరెస్ట్‌ చేశాం.. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని దౌసా పోలీసు అధికారి రాజ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో వివేక్‌ కూడా ప్రమేయం ఉన్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
Tags:    

Similar News