సిరాజ్, సమీర్ కాదు.. మిగిలిన పది మంది ఎక్కడ? వారి ప్లాన్ ఏంటి?
సిరాజ్ ఒక్కడే బాంబ్ బ్లాస్ట్ లకోసం ప్లాన్ చేయలేదు. అతినికి సహకరించిన వారిపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు
సిరాజ్ ఒక్కడే బాంబ్ బ్లాస్ట్ లకోసం ప్లాన్ చేయలేదు. అతినికి సహకరించిన వారిపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎవరెవరితో గత కొన్నేళ్లుగా సిరాజ్ కు లింకులున్నాయన్న దానిపై విచారణ చేస్తున్నారు. భారత్ లో పేలుళ్లకు కుట్రకు సిరాజ్ ఒక్కడే ప్రయత్నించడాంటే పోలీసులకు కూడా నమ్మశక్యంగా లేదు. అతని వెనక బలమైన శక్తులు ఏవో ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వారు సిరాజ్ ను ఇందులో పావుగా వాడుకున్నారని, ఉగ్రవాద భావాజాలనికి ఆకర్షితుడైన సిరాజ్ ద్వారా తమ ప్లాన్ ను అమలు పర్చాలని ప్రయత్నించిన వారిని పట్టుకునేందుకు ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజల పాటు సిరాజ్, సమీర్ ల విచారణలో కూడా ఇవే విషయాలపై ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలిసింది.
ఆ పది మంది ఎవరు?
హైదరాబాద్ లోని యువకులయితే అనుమానం వస్తుందని భావించి సిరాజ్ ను ఎంచుకుని ఉండవచ్చన్న అనుమానం కూడా ఎన్ఐఏ అధికారులకు కలుగుతుంది. మారుమూల, అందులోనూ ఎలాంటి అనుమానం రాని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా విజయనగరంలోని సిరాజ్ వారికి దొరకడంతో అతని ద్వారా ప్లాన్ ను పక్కగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సిరాజ్ వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహిద్దీన్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బాదర్ ను కలిసిన దానిపై కూడా విచారణ జరిపినట్లు తెలిసింది. ముంబయిలో మత సంబంధమైన ప్రసంగాలు వినేందుకు సిరాజ్ తో వెళ్లిన మిగిలిన పది మంది ఎవరన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
వీరి వెనక ఎవరు?
ఇక హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్ అక్రమ్ ఒమన్ లో ఉంటూ సిరాజ్ కు ఎలా పరిచయమయ్యాడన్న దానిపైన కూడా ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇమ్రాన్ సిరాజ్ కు డబ్బులు పంపడం వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేక ఇమ్రాన్ ఒక్కడే ఈ కుట్రకు పాల్పడ్డారా? అన్న దానిపై కూడా విచారణ జరపుతున్నారు. పేలుళ్లకు కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఎంత డబ్బునైనా పంపడానికి సిద్ధమని ఇమ్రాన్ చెప్పాడంటే అతని వెనక ఎవరో ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇందులో బీహార్ కు చెంది అబూ ముసాబ్ పై కూడా అనుమానం కలుగుతుంది. సిగ్నల్ యాప్ ద్వారా వారు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై నిపుణులతో విశ్లేషణ జరపాలని నిర్ణయించారు. ఈ కేసులో వీరిద్దరిని నిందితులుగా తీర్చారు. మొత్తం పన్నెండు మంది సభ్యులుగా అహిం ముఠాలో మిగిలిన పది మంది ఎక్కడ అన్న దానిపై ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు శోధిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడైనా పేలుళ్లకు కుట్రలు జరిపారా? అన్నదానిపై ఆరా తీస్తున్నారు.