రాత్రి చంపేసి.. అనుమానం రాకుండా అంత్యక్రియలకు.. నెల్లూరు కేసులో షాకింగ్ విషయాలు

నెల్లూరులో కలకలం రేపిన దంపతుల దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓనర్ తిట్టాడని కోపం పెంచుకున్న హోటల్ సప్లయరే దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఓనర్ దంపతులను కిరాతకంగా హతమార్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మరుసటి రోజు అంత్యక్రియలకు హాజరై ఏమీ ఎరగనట్టు డ్రామాకు తెరతీశారు.

Update: 2022-09-01 15:06 GMT

నెల్లూరులో కలకలం రేపిన దంపతుల దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓనర్ తిట్టాడని కోపం పెంచుకున్న హోటల్ సప్లయరే దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఓనర్ దంపతులను కిరాతకంగా హతమార్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మరుసటి రోజు అంత్యక్రియలకు హాజరై ఏమీ ఎరగనట్టు డ్రామాకు తెరతీశారు. పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఇందుగపల్లికి చెందిన వాసిరెడ్డి కృష్ణా రావు(55), సునీత(50) దంపతులు పదిహేనేళ్ల కిందట నెల్లూరు నగరానికి వలసొచ్చి స్థిరపడ్డారు. నగరంలోని అశోక్ నగర్‌లో కుటుంబంతో నివాసముంటున్న కృష్ణారావు కరెంట్ ఆఫీసు వద్ద హోటల్ నడుపుతున్నారు. తన హోటల్‌లో పనిచేస్తున్న శివ అనే సప్లయర్‌ను తరచూ తిడుతుండడంతో అతను కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఓనర్‌ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు ఆశతో ఓనర్‌కి బంధువైన రామక్రిష్ణ అతనికి సహకరించేందుకు ఒప్పుకున్నాడు. రోజూ రాత్రి హోటల్ మూసేసిన తర్వాత కృష్ణా రావు ఆలస్యంగా ఇంటికి వెళ్లేవారు. అదే అదనుగా భావించిన దుర్మార్గులు గత నెల 27న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి వద్దనే దారుణంగా హత్య చేశారు. మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా చంపేశారు. ఇంటి తాళం తీసుకుని లోపలికి వెళ్లి నిద్రిస్తున్న కృష్ణారావు భార్య సునీత తలపై కర్రతో కొట్టి అంతం చేశారు. అనంతరం ఇంట్లో నగదు తీసుకుని వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఎవరికీ దారుణం గురించి తెలియలేదు. ఉదయం పాలు పోసేందుకు వచ్చిన మహిళ రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణా రావుని చూసి భయపడిపోయింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వచ్చి చూడడంతో దారుణం వెలుగుచూసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. జంట హత్యలు నగరంలో అలజడి రేపడంతో తమపై అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు దంపతుల అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో నిందితులు దొరికిపోయారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News