స్విగ్గీ డ్రెస్ లో వచ్చి.. ఐదు నిమిషాల్లో దోపిడీ.. మామూలోళ్లు కాదుగా

ఉత్తర్ ప్రదేశ్ లో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. రెచ్చిపోయారు. ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది

Update: 2025-07-25 06:50 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. రెచ్చిపోయారు. ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఫుడ్ డెలవరీ ఏజెంట్ల ముసుగులో వచ్చిన కొందరు నగల షాపులోకి చొరబడి దోచుకుని వెళ్లారు. లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. జ్యుయలరీ దుకాణం యజమానులను బెదిరించి మరీ దోచుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం ఇద్దరు వ్యక్తులే ఇంతటి దోపిడీకి పాల్పడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఘజియాబాద్ లో...
ఘజియాబాద్ లో పట్టపగలే జరిగిన ఈఘటనతో నగల దుకాణాల వ్యాపారులు ఆందోళనకు దిగారు. దుకాణాలను మూసి వేసి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇద్దరు యువకులు బ్లింకిట్, స్విగ్గీ డ్రెస్ లను ధరించడంతో పాటు హెల్మెట్లతో జ్యుయలరీ దుకాణంలోకి వచ్చారు. వారని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దుకాణ సిబ్బందిని నెట్టివేశారు. నిన్న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుకాణంలో ఉన్న ఆభరణాలను తము తెచ్చుకున్న సంచుల్లో వేసుకుని వెళ్లిపోయారు.
హెల్మెట్లు ధరించి...
ద్విచక్రవాహనం పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. సీసీ టీవీ కెమెరాల్లో మొహాలు కనిపించకుండా హెల్మెట్లు ధరించి జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం ఐదు నిమిషాల్లోనే దోపిడీ చేసుకుని పారిపోయారు. ఈ దోపిడీలో 125 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇరవై కిలోల వెండి దోపిడీ దొంగలు తీసుకెళ్లినట్లు దుకాణ యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తెలిసిన వారు ఈ పనికి పాల్పడ్డారా? గతంలో పనిచేసిన వారితో పాటు ప్రస్తుతం దుకాణంలో పనిచేస్తున్న వారిపై కూడా అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దోపిడీకి గురైన ఆభరణాల విలువ 30 లక్షల వరకూ ఉంటుందని చెబుతున్నారు. దొంగల కోసం పోలీసులు విస్తృతంగా టీమ్ లుగా విడిపోయి గాలిస్తున్నారు.



Tags:    

Similar News