ఖరీదైన ఇళ్లలోనే దొంగతనాలు.. విమానాల్లో ప్రయాణం.. స్టార్ హోటల్ లో బస... చివరకు చిక్కాడుగా?
మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నేరగాడు సలీమ్ హబీబ్ ఖురేషీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నేరగాడిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సలీమ్ హబీబ్ ఖురేషీ పోలీసులకు సవాల్ గా మారాడు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులను నిద్రపోనివ్వకుండా చేశాడు. దొంగతనాలు చేశాడంటే ఒక రేంజ్ ఉన్న ఇంటినే ఎంచుకుంటాడు. ఒక్క తెలంగాణలోనే సలీమ్ హబీబ్ ఖురేషీపై అరవై ఐదు కేసులు ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో మూడు వందల కేసుల్లో నిందితుడు. హైదరాబాద్ కు చెందిన షేక్ గౌస్ ను తన అనుచరుడిగా మార్చుకుని సంపన్నుల ఇంట్లోనే టార్గెట్ చేస్తాడు.
మూడు రాష్ట్రాల పోలీసులనూ...
బెంగళూరు నుంచి తెలంగాణకు, ఇక్కడి నుంచి ముంబయికి విమానంలో ప్రయాణాలు చేస్తాడు. మూడు నగరాల్లో స్టార్ హోటల్స్ లో బస చేస్తాడు. ఇక ఖరీదైన కార్లలో తిరుగుతుంటూ ఎవరికీ దొంగ అని అనుమానం రానివ్వడు. అతగాడు ఎప్పడో పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. కానీ పోలీసుల కన్నుగప్పి ఎక్కడికక్కడ తప్పించుకుంటున్నాడు. ధనవంతుల ఇళ్లను ఎంపిక చేసుకోవడం రెక్కీ నిర్వహించడం రాత్రికి తన అనుచరులతో కలసి దొంగతనాలు చేయడం, బంగారం, వెండి నగలతో పాటు నగదును కూడా దొంగిలించడం సలీమ్ హబీబ్ ఖురేషీకి వెన్నతో పెట్టిన విద్య. ముంబయిలో ఉన్న అతగాడు ఏకంగా మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లోనే చోరీ చేసి, దాని విలువ సొత్తు విలువ 9 కోట్ల రూపాయల విలువ ఉంటుందని పత్రికల్లో రావడంతో గుడ్లు తేలేశాడు.
చోటా రాజన్ ఇంటినే కొల్లగొట్టి...
చోటా రాజన్ గ్యాంగ్ ఇతని కోసం వెదికితే వెంటనే సరెండర్ అయి వెళ్లి తనకు తెలియకుండా తప్పు జరిగిపోయిందని, ఇక ముంబయిలో ఉండనని చెప్పి సలీమ్ హబీబ్ ఖురేషీ తన మకాంను బెంగళూరుకు మార్చేశాడు. దాదాపు ఇరవై ఏళ్లకు పై నుంచి సలిం గ్యాంగ్ దోపిడీ లు చేస్తూ ధనవంతుల ఇళ్లను దోచుకెళుతుంది. తాను కొట్టేసిన బంగారం, వెండి వస్తువులను బెంగళూరులో విక్రయిస్తాడు. 2012లో తెలంగాణ పోలీసులకు చిక్కినా తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే తాజాగాముంబయి పోలీసులు సలీమ్ హబీబ్ ఖురేషీతో పాటు గౌస్ ను కూడా పట్టుకున్నారు.
ముంబయిలో పుట్టి...
సలీమ్ హబీబ్ ఖురేషీ సొంత ప్రాంతం ముంబయి. గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్ లో అతని కుటుంబం ఉండేది. సలీం ఆరో తరగతి వరకూ చదవి చిన్న చిన్న దొంగతనాలతో జీవితాన్ని ప్రారంభించి తర్వాత పెద్ద గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. 2001 నుంచి సలీమ్ హబీబ్ ఖురేషీ గ్యాంగ్ మూడు వందల దొంగతనాలకు పాల్పడి కోట్లాది రూపాయల సొత్తు కొల్లగొట్టాడంటే వీడు ఏ రేంజ్ లో దొంగతనాలు చేస్తాడో చెప్పకనే తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన ఒక యువతిని మూడో వివాహం చేసుకున్న సలీమ్ హబీబ్ ఖురేషీ అక్కడే ఉంటూ తన గ్యాంగ్ కు డైరెక్షన్ ఇస్తూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. మొత్తం సలీమ్ హబీబ్ ఖురేషీ గ్యాంగ్ దొరికిపోవడంతో పోలీసులతో పాటు సంపన్నులు కూడా ఊపిరిపీల్చుకున్నట్లయింది.