పాలు తాగట్లేదని ఐదురోజుల శిశువుపై దారుణం

బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా దంపతులకు ఈ నెల 11న ఫతేపూర్ ఆరోగ్య కేంద్రంలో పండంటి..

Update: 2023-06-17 05:22 GMT

పుట్టిన పిల్లలు తల్లిపాలు తాగడం కొంచెం కష్టమే. వాళ్లకి పాలు అలవాటు చేసేందుకు తల్లి ప్రయత్నించాలి. ఆకలివేస్తే ఏడవడం తప్ప ఏమీ తెలియని పసికందులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లి.. పాలు తాగడం లేదని దారుణానికి పాల్పడింది. పాలు తాగకపోతే అందుకు పరిష్కారం ఏంటో వైద్యులను అడిగి అవి పాటించాల్సింది పోయి కర్కశంగా వ్యవహరించింది. తల్లి అనే పదానికే మచ్చతెచ్చింది. పాలు తాగట్లేదని శిశువు చేతివేళ్లను వేడి నూనెలో ముంచింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బారాబంకీ జిల్లా ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా దంపతులకు ఈ నెల 11న ఫతేపూర్ ఆరోగ్య కేంద్రంలో పండంటి బిడ్డ పుట్టాడు. మొదటి మూడు నాలుగు రోజులు బాగానే ఉన్న చిన్నారి ఉన్నట్టుండి తల్లిదగ్గర పాలు తాగడం మానేశాడు. దాంతో ఆందోళనకు గురైన ఆసియాకు.. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది దారుణ సలహా ఇచ్చారు. పాలు తాగాలంటే చిన్నారి చేతివేళ్లను వేడినూనెలో ముంచాలని చెప్పడంతో.. వాళ్లు చెప్పినట్టే చేసింది. అప్పటికే ఆసియా ఓ బిడ్డను కోల్పోయింది. పుట్టిన కొన్ని రోజులకు పాలు తాగడం మానేసిన బిడ్డ ఆ తరువాత మృతి చెందింది. ఈ బిడ్డకూడా అలానే దూరమవుతుందని భావించి ఆసియా ఆ పనిచేసింది. విధుల్లో ఉన్న ఓ నర్సు ఈ విషయాన్ని గుర్తించి వైద్యుడికి ఫిర్యాదు చేసింది. వైద్యుడు చిన్నారికి వెంటనే వైద్యం అందించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Tags:    

Similar News