లేడీ డాన్ అరుణ రహస్యమంతా అందులోనే?
నెల్లూరులో సంచలనం కలిగించిన లేడీ డాన్ అరుణ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపింది.
నెల్లూరులో సంచలనం కలిగించిన లేడీ డాన్ అరుణ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపింది. శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చిన విషయం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు తలంటేశారు. అయినా రోజూ ఏదో ఒకటి అరుణ - శ్రీకాంత్ వ్యవహారంలో బయపడుతుంటంతో కూటమి ప్రభుత్వానికి చికాకుగా మారింది. సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. అయితే తవ్వే కొద్దీ అనేక ఆసక్తి కరమైన విషయాలు అరుణ వ్యవహారంలో వెలుగుచూస్తున్నాయి.
పోలీసు వర్గాల్లో కలకలం..
అరుణ వ్యవహారం పోలీసు శాఖలోనూ కలకలం రేపుతోంది. పోలీసు ఉన్నతాధికారులలో కొందరిని ఆమె గుప్పిట పట్టుకుని చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అరుణ చాలా ముందుచూపుతోనే ఇవన్నీ చేశారు. పక్కా ప్లాన్ తో అరుణ సెటిల్ మెంట్లు నడిపినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ప్రతి విషయాన్నితన ఫోన్ లోనే పెట్టుకున్నారు. ఏదైనా తేడా వస్తే వాటిని వినిపించి బ్లాక్ మెయిల్ కు కూడా అరుణ దిగిందని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అరుణ ఫోన్ ను పోలీసులు సీజ్ చేసి దానిని పరిశీలిస్తున్నారు.
ఫోన్ ను స్వాధీనం చేసుకున్నా...
అరుణను అరెస్టు చేసినప్పుడే ఆమె ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆమె లాక్ తీయడం లేదని పోలీసులు చెబుతున్నారు.నెల్లూరు పోలీసులు ఫోన్ లాక్ తీయించడానికి, ఫోన్లలో సమాచారం తీసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఆ దిశగానే న్యాయపరమైన ప్రయత్నాలు చేయాలని నెల్లూరు పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఆ ఫోన్లలో ఎవరెవరు ఉన్నారన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కొందరు పోలీసు అధికారుల సహకారం ఉండబట్టే అరుణ ఇలా పేట్రేగిపోయారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసుల విచారణలో ఏ విషయాలు బయపడతాయన్నది ఆసక్తికరంగా మారిది. మరొకవైపు శ్రీకాంత్, అరుణ సెటిల్ మెంట్లపై రోజూ ఫిర్యాదులు వస్తుండటంతో నెల్లూరు పోలీసులకు తలనొప్పిగా తయారైంది.