ఎవర్రా బాబూ ఈ యూట్యూబర్లు.. పనిలేకుండా..తిరిగితే చివరకు ఇంతే

జ్యోతి మల్హోత్రా మన దేశంలో ఉంటూ భారత్ లో యూట్యూబర్ గా లక్షల్లో వ్యూస్ డబ్బులు సంపాదించుకుని చివరకు పాక్ చేతులో పావుగా మారిపోయారు.

Update: 2025-06-02 05:36 GMT

యూట్యూబర్లు వినోదాన్ని పంచాలి. అవసరమైతే విజ్ఞానాన్ని అందించాలి. అంతే తప్పించి దేశానికి సంబంధించిన విషయాలను శత్రు దేశాలకు అందించడం మహానేరం అవుతుంది. జ్యోతి మల్హోత్రా మన దేశంలో ఉంటూ భారత్ లో యూట్యూబర్ గా లక్షల్లో వ్యూస్ సంపాదించుకుని చివరకు పాక్ చేతులో పావుగా మారిపోయారు. జ్యోతి మల్హోత్రా చేసిన పని దేశ ద్రోహం కింద వస్తుంది. చివరకు పాక్ లో జ్యోతి మల్హోత్రా పర్యటించినప్పుడు పాక్ నుంచి రక్షణ కల్పించారంటే ఆమె ఏ రేంజ్ లో పాక్ కు సహకరించిందని చెప్పాలి. పెహల్గామ్ ఘటన జరగక ముందు అక్కడ పర్యటించి ఆ ప్రాంతాలను షూట్ చేసిన జ్యోతి మల్హోత్రాను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏపీకి చెందిన యూట్యూబర్...
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన య్యూట్యూబర్ సన్నీ యాదవ్ పై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తుంది. పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా చెన్నై చేరుకున్న సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారంటున్నారు. అయితే ఎన్ఐఏ అధికారులు దీనిని ధృవీకరించడం లేదు. అయితే చెన్నైలోనే ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం అక్కడ ప్రజలతో మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. పాకిస్తాన్ కు వెళ్లవద్దని ఎవరూ అనలేదు కానీ, అక్కడకు వెళ్లి అనవసర విషయాల్లో తలదూర్చడమే ఇప్పుడు సన్నీ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడానికి కారణమయింది.
పాక్ కు వెళ్లి...
అయితే సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడికి పాక్ ఉగ్రవాదులతో సంబంధం లేదని అంటున్నారు. కేవలం యూ ట్యూబ్ వీడియోలు మాత్రమే చేస్తుంటాడని, అలాంటి సన్నీ యాదవ్ ను ఎవరు తీసుకెళ్లారన్న దానిపై తమకు సమాచారం అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.యూట్యూబర్ సన్నీ యాదవ్ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సన్నీ యాదవ్ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. నిన్న జ్యోతి మల్హోత్రా, సన్నీ యాదవ్ లను కలిపి ఎన్ఐఏ అధికారులు విచారించారంటున్నారు. పాక్ తో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. జ్యోతి మల్హోత్రాతో ఫోన్ సంభాషణలపై కూడా వారు ఆరా తీస్తున్నారు.
నిజమో అబద్ధమో...
సన్నీ యాదవ్ నిజానికి పాక్ కు సహకరించారన్న ఆరోపణల్లో నిజం ఉందో లేదో తెలియదు. కానీ ఫిబ్రవరి నెల 14 నుంచి 21 తేదీల మధ్య సన్నీ యాదవ్ పాకిస్తాన్ లో పర్యటించడం, గూఢచర్యం ఏమైనా చేశాడా? భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఏమైనా ఇచ్చాడా? అన్న దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇటీవల పాక్ లో బైక్ టూర్ చేసిన సన్నీ యాదవ్ రెండు నెలల పాటు పాకిస్థాన్ లోనే ఉండటం, సన్నీ యాదవ్ పర్యటించిన ప్రాంతాలు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తుల గురించి అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎన్ఐఏ అధికారులు రొటీన్ గానే విచారిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద యూట్యూబర్లు చేస్తున్న అతికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
Tags:    

Similar News