Hyderabad : ఏం ప్లాన్ వేశాడు సామీ... గుర్తుపట్టరనుకుంటే.. పట్టుకుని తాటతీస్తున్నారుగా?

. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జయప్రకాశ్ గౌడ్ హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలోని పాఠశాలలో మత్తు పదార్థాలను తయారీ చేస్తూ అరెస్ట్ అయ్యాడు

Update: 2025-09-14 06:16 GMT

పాఠశాల అంటే ఎవరికి అనుమానం రాదు. అక్కడ చిన్నారులకు చదువు నేర్పే విద్యాలయాలుగా చూస్తారు. సరస్వతి నిలయాలపై పెద్దగా నిఘా కూడా ఉండదు. దీనిని కేటుగాడు తనకు అనుకూలంగా మలచుకుని అడ్డదారిలో సంపాదించాలనుకున్నాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. తాను నిర్వహిస్తున్న పాఠశాలనే మత్తు పదార్థాల తయారీకి అడ్డాగా మార్చి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. మహబూబ్ నగర్ కు చెందిన జయప్రకాశ్ గౌడ్ హైదరాబాద్ లోని బోయిన్ పల్లికి వచ్చిసాయికాలనీలో నివాసం ఉంటున్నాడు.

పాఠశాల రెండో అంతస్థులో...
అయితే అదే ప్రాంతంలో మేధా పేరుతో ఒక పాఠశాలను నిర్వహిస్తున్నాడు. అంతకు ముందు ఈ పాఠశాలను వేరొకరు నిర్వహించేవారు. వారి నుంచి జయప్రకాశ్ గౌడ్ స్కూలును తీసుకున్నాడు. అయితే ఈ పాఠశాలలో ఎల్.కే.జీ నుంచి పదోతరగతి వరకూ తరగతి గదులు నిర్వహిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనంలో ఉన్న ఈ స్కూలును కేవలం చదువుల కోసమే వినియోగించకుండా దొడ్డిదారిన డబ్బులు సంపాదించాలన్న కక్కుర్తితో అల్ఫ్రాజోలం తయారీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం పాఠశాల రెండో అంతస్థులో రెండు గదులను ఇందుకు ఉపయోగించుకున్నాడు.
తన సొంత జిల్లాలో విక్రయిస్తూ...
అల్ఫ్రాజోలం తయారీ తనకు తెలియకపోవడంతో తనకు సన్నిహితుడైన గురవారెడ్డిని సంప్రదించగా అతను దీని తయారీ ఫార్ములా అందించాడు. అంతే ఇక రెండు గదుల్లో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా దీనిని తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. తయారు చేసిన అల్ఫ్రాజోలం ను తన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూరు మండలంలో ఉన్న కల్లు దుకాణాలకు విక్రయిస్తున్నాడు. అయితే దీనిని పసిగట్టిన ఈగల్ టీం పాఠశాలను తనిఖీలు చేసి అల్ఫ్రాజోలం తో పాటు పరికరాలను సీజ్ చేసింది. వీరితో పాటు బోయిన్ పల్లికి చెందిన ఉదయ్ సాయి, మురళిని కూడా అరెస్డ్ చేశారు. దీంతో పాఠశాల అని స్థానికులను నమ్మించి మత్తు పదార్థాలను తయారుచేస్తున్న నిర్వాకం తెలిసి అక్కడి వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.
Tags:    

Similar News