కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి?
బీహార్ లో మద్యం నిషేధం అమలులో ఉన్న సమయంలో కల్తీ మద్యం తాగి మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది
బీహార్ లో మద్యం నిషేధం అమలులో ఉన్న సమయంలో కల్తీ మద్యం తాగి మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా మరో ఏడుగురు మరణించారని చెబుతున్నారు. వీరి మరణానికి కారణం కల్తీ మద్యం తాగడం వల్లనేనని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం కారణాలు తెలియడం లేదని చెబుతున్నారు. మృతదేహాలను దహనం చేయడం వల్ల మృతికి గల కారణాలు తెలియడం లేదని పోలీసులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జనవరి 15వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
విచారణ సాగుతుందని...
బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఏడుగురు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. బీహార్ లో మద్య నిషేధం అమలు అయిన నాటి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఈ కల్తీ మద్యం వస్తుందని కొందరు ఆరోపిస్తుండగా, రాష్ట్రంలోనే తయారు చేసి విక్రయిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. కొందరు కల్తీ మద్యాన్ని విక్రయించడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ శౌర్య సుమన్ తెలిపారు.