పిల్లలు పోటీ పడలేరని.. కాళ్లూ చేతులూ కట్టి హత్యచేసిన తండ్రి

పిల్లల భవిష్యత్తుపై భయంతో తండ్రి కాళ్లూ చేతులూ కట్టి నీళ్ల బకెట్లలో తల ముంచి హత్య చేసి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2025-03-15 06:13 GMT

కాకినాడ, సర్పవరం జంక్షన్: బిడ్డలను కాపాడాల్సిన తండ్రే వారిపై ఘోరంగా విరుచుకుపడ్డాడు. తన ఇద్దరు పిల్లలను క్రూరంగా హత్య చేసి, అనంతరం తానే ఉరివేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హోలీ పండుగ రోజున కాకినాడలోని సుబ్బారావునగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్‌ (కాకినాడ వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఎకౌంటెంట్‌) కుటుంబంతో కలిసి నగరంలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. తన భార్య తనూజ, పిల్లలు జోషిల్‌ (7), నిఖిల్‌ (6) చదువులో రాణించలేరనే ఆందోళనతో ఆయన ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

భార్యను మోసం చేసి పిల్లలపై దారుణం

హోలీ పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి కార్యాలయ వేడుకలకు హాజరైన చంద్రకిశోర్‌, పిల్లలను టైలర్‌ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి ఇంటికి వచ్చాడు. అక్కడ పిల్లల చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, నీటి బకెట్లలో తల ముంచి ఊపిరి తీసేశాడు. అనంతరం తానే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.

తనూజ భర్త నుంచి ఫోన్‌ కాల్‌ లేకపోవడంతో అనుమానం వచ్చి తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరుకుంది. కిటికీలోంచి చూడగా భర్త ఉరివేసుకుని కనిపించాడు. తలుపులు తెరిచి చూడగా పిల్లలు నీటి బకెట్లలో మృతిచెందిన దృశ్యం ఆమెను కన్నీటిసముద్రంలో ముంచేసింది.

సూసైడ్‌ నోట్‌ – భవిష్యత్తుపై భయంతోనే ఈ అఘాయిత్యం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్‌ సూసైడ్‌ నోటులో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులేమీ లేవని, ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి సోదరుడు వాపోయారు.


Tags:    

Similar News