Tamilnadu : తమిళనాడులో ఎన్ కౌంటర్.. ముగ్గురు అరెస్ట్
తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్కౌంటర్ జరిగింది.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్కౌంటర్ జరిగింది. కొయంబత్తూరు నగర పరిసర ప్రాంతంలో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ సరవణ సుందర్ మంగళవారం వెల్లడించారు. నిందితులను గుణ, కరుప్పస్వామి, కార్తిక్ అలియాస్ కాళీశ్వరన్‌గా గుర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకెళ్లే క్రమంలో పారిపోయే ప్రయత్నం చేసినందున కాళ్లలో కాల్చినట్లు తెలిపారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
యువతిపై విమానాశ్రయ సమీపంలో...
ఆదివారం రాత్రి కొయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బాధితురాలు, ఆమె స్నేహితుడిపై ముగ్గురు దుండగులు దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. అనంతరం విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించి, అక్కడి నుండి పారిపోయారని తెలిపారు. బాధితురాలి స్నేహితుడు స్పృహతప్పి కాసేపటి తర్వాత మళ్లీ చైతన్యానికి వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో దాక్కున్న ముగ్గురిపై కాల్పులు జరిపారు. అనంతరం వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.