తిరుపతి జిల్లాలో మృతదేహాలు.. కలకలం రేపిన ఈ ఘటనకు అసలు కారణమదేనా?
తిరుపతి జిల్లాలో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను గుర్తించారు.
తిరుపతి జిల్లాలో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను గుర్తించారు. మృతులు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాకు చెందిన వారివిగా గుర్తించారు. తిరుపతి జిల్లాలోని పాకాల మండలం సరిహద్దుల్లోని పనపాకం రక్షిత అడవిలో బాగా కుళ్లిపోయిన స్థితిలో ఈ మృతదేహాలు బయటపడ్డాయి. పశువులను మేపుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన వారికి ఈ మృతదేహలు బయటపడటంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో ఒకరు మహిళ, మరొకరు పురుషుడుగా గుర్తించారు.
రెండు మృతదేహాలు...
అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా, మహిళ మృతదేహంపై గుడ్డ కప్పి ఉంది. అయితే ఆ ప్రాంతంలోనే మరికొన్ని మృతదేహాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోనే గోతులు తవ్వి పూడ్చి పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఆ గోతుల్లో చిన్నారుల మృతదేహాలు ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. పక్కనే ఉన్న గోతుల్లో చిన్నారులను పూడ్చిపెట్టి ఉండవచ్చన్నది పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు.
అనారోగ్యమే కారణమా?
అయితే ఈ పక్కనే మద్యం సీసాలు కూడా ఉండటంతో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. ఈ కుటుంబం తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.తమిళనాడులోని తంజావూరుకు చెందిన కళై సెల్వన్ గా పోలీసులు గుర్తించారు. మరొక సెల్ ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో సిమ్ కార్డు లేకపోవడాన్ని గుర్తించారు. అయితే కుటుంబ సమస్యలతోనైనా, అనారోగ్య సమస్యల కారణంగానైనా వారు చిన్నారులను చంపేసి దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.