Vijayawada : విజయవాడలో ఘరానా మోసం.. లక్షకు నెలకు ఆరు నెలల వడ్డీ పేరుతో వంచన
అద్వైక ట్రేడింగ్ కంపెనీ పేరుతో విజయవాడలో డిపాజిట్ల పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు సేకరించి చివరకు చేతులెత్తేసింది
లక్ష రూపాయలు పెట్టుబడితే నెలకు ఆరు వేల రూపాయలు వడ్డీ. ఎన్ని లక్షలయినా పెట్టొచ్చు. లిమిట్ లేదు. అంటూ అద్విక సంస్థ విజయవాడలోజనాన్ని నమ్మించింది. పెట్టుబడికి ఇదే సరైన మార్గమని చెబుతూ బోలెడు ప్రకటనలు చేసింది. అద్వైక ట్రేడింగ్ కంపెనీ పేరుతో విజయవాడలో డిపాజిట్ల పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు సేకరించి చివరకు చేతులెత్తేసింది. పెట్టుబడి పెట్టిన వారు లబోదిబోమంటున్నారు. పోలీసులను ఆశ్రయించారు.నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ సంస్థలో లక్షలు పెట్టుబడి నేడు లబోదిబోమంటున్నారు అనేక మంది బాధితులు.
ఎల్ఐసీ ఏజెంట్ గా పనిచేసి...
ఇప్పటి వరకూ వడ్డీ డబ్బు కూడా సరిగా చెల్లించకపోవడంతో నిర్వాహకుడిని నిలదీశారు. దీంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే విజయవాడ పోలీసులు అద్వైక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెలకు ఆరు శాతం వడ్డీ అంటే ఆశపడి అనేక మంది ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వేల సంఖ్యలోనే అద్వైక కంపెనీ బాధితులున్నారని చెబుతున్నారు. పోలీసు కేసు నమోదయిందని తెలుసుకుని మిగిలిన వారు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ పత్రాలను చూపి ఫిర్యాదుచేస్తున్నారు. తాడేపల్లికి చెందిన ఆదిత్య విజయవాడలో కొన్నాళ్ల పాటు ఎల్ఐసీ ఎజెంట్ గా పనిచేసి ఆ తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని సంపాదించాలని అద్వైక ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు.
మూడు జిల్లాల నుంచి...
2022లో ఏర్పాటయిన అద్వైక ట్రేడింగ్ కంపెనీ విజయవాడలో బ్రాంచ్ లు కూడా ఏర్పాటు చేశారు. గుణదల, ఎల్ఐసీ కాలనీల్లో అద్వైక కంపెనీ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకట్టుకనే ప్రయత్నం చేశాడు ఆదిత్య. కేవలం విజయవాడ మాత్రమే కాదు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి వచ్చి మరీ పెట్టుబడులు పెట్టారు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో అందరూ నమ్మేశారు. పదవీ విరమణ చేసిన వారి దగ్గర నుంచి కొద్దో గొప్పో డబ్బు దాచి పెట్టుకున్న వారంతా అద్వైక కంపెనీకి సమర్పించుకున్నారు. దాదాపు పన్నెండు వందల మంది మూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టారంటుున్నారు. తొలుత సక్రమంగా వడ్డీ చెల్లించిన గత కొన్ని నెలల నుంచి వడ్డీ డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగు చూసింది.