రంగం లోకి సీబీఐ, డీఐజీ అరెస్ట్
సీబీఐ తనిఖీలలో ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లార్ అడ్డంగా దొరికిపోయారు.
సీబీఐ తనిఖీలలో ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లార్ అడ్డంగా దొరికిపోయారు. పంజాబ్, చండీగఢ్లోని భుల్లార్ నివాసాల్లో సుమారు 5 కోట్ల రూపాయలు నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, స్థిరాస్తుల డాక్యుమెంట్లు, రెండు లగ్జరీ వాహనాల తాళాలు, 22 లగ్జరీ గడియారాలు దొరికాయి. లాకర్ తాళాలు, 40 లీటర్ల దిగుమతి చేసిన మద్యం, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్గన్ తో సహా మందుగుండు సామగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకుంది.
మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ భట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు 8 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్ డిమాండ్ చేశారు. కిర్షణు అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. వ్యాపారి ఆకాశ్ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు రంగంలో దిగి భుల్లార్ ను అదుపులోకి తీసుకున్నారు.