టెన్త్ విద్యార్థి హత్య కేసులో సంచలన విషయాలు

Update: 2023-06-17 03:56 GMT

ట్యూషన్ కు వెళ్లొస్తున్న పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ పై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో చోటు చేసుకుంది. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం ట్యూషన్ కు వెళ్లొస్తున్న అమర్నాథ్ పై.. మార్గమధ్యంలో రెడ్లపాలెం వద్ద వెంకటేశ్వరరెడ్డి, మరికొందరు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అమర్నాథ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అరుపులు, కేకలు పెట్టాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అమర్నాథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోలు దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వెంకటేశ్వర్‌రెడ్డి పేరును చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే మృతి చెందాడు. బాలుడు పేర్కొన్న వెంకటేశ్వర్‌రెడ్డి.. బాధిత బాలుడు అమర్నాథ్‌రెడ్డి సోదరిని పలుమార్లు వేధించాడని విచారణలో తెలిసింది. విషయం తెలిసిన అమర్నాథ్ రెండు నెలల క్రితం వెంకటేశ్వర్‌రెడ్డిని నిలదీశాడు. ఇంకోసారి అలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు. దీంతో బాలుడిపై కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి స్నేహితులతో కలిసి రెండుసార్లు బాలుడిపై దాడిచేశాడు. తనపై దాడి విషయాన్ని అమర్నాథ్ వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అమర్నాథ్‌పై మరింత కక్ష పెంచుకున్న నిందితుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సైకిలుపై ట్యూషన్ నుంచి వస్తున్న బాలుడిని అడ్డగించి కొట్టాడు. ఆ తర్వాత కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి తగలబెట్టాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.


Similar News