Digital Arrest: వీడియోకాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ బెదిరింపు… రిటైర్డ్ వైద్యుడికి ₹36 లక్షల మోసం

క్రైమ్ బ్రాంచ్–ED–CBI పేర్లు చెప్పి భయపెట్టిన గ్యాంగ్ బ్యాంక్‌ ఖాతాల్లో ‘వెరిఫికేషన్’ పేరుతో డబ్బులు పంపించిన డాక్టర్

Update: 2025-12-10 06:40 GMT

కొండాపూర్‌కు చెందిన ప్రభుత్వం రిటైర్డ్‌ వైద్యాధికారి ఎల్లెందుల శ్రీనివాస్‌ (61)ను నకిలీ అధికారుల గ్యాంగ్ ₹36 లక్షలు మోసగించిందని పోలీసులు తెలిపారు. నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ మొదటి వారంలో ఈ మోసం కొనసాగింది.

శ్రీనివాస్‌కు  ‘దేవీ లాల్‌ సింగ్’ అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి కాల్‌ చేశాడు. తాను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు అధికారి అని చెప్పి, శ్రీనివాస్‌ పేరుతో అనేక బ్యాంక్‌ అకౌంట్లు తెరుచుకున్నాయని, అవి మనీలాండరింగ్‌ కోసం విదేశాలకు డబ్బులు పంపించేందుకు వాడుతున్నారని ఆరోపించాడు. ఈ వ్యవహారంలో ‘నరేష్‌ గోయల్‌’ అనే వ్యక్తి ఉన్నాడని చెప్పాడు.

శ్రీనివాస్‌ వాదనలు వినకుండా, అరెస్టు చేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘జాతీయ రహస్యం… వీడియోకాల్‌లోనే ఉండాలి’

సింగ్‌ వెంటనే మరో వ్యక్తితో వీడియోకాల్‌ కలిపాడు. అతడు తనను ‘IPS అధికారిగా శివం సుబ్రహ్మణ్యం’గా పరిచయం చేసుకున్నాడు. సీనియర్‌ సిటిజన్‌ కాబట్టి “సహాయం చేస్తాన’’ని చెప్పి, వీడియోకాల్‌ను ఎప్పటికప్పుడు ఆఫ్‌ చేయొద్దని ఆదేశించాడు. ఇది ‘‘జాతీయ రహస్యం’’ అని చెప్పి, తాను డిజిటల్‌ అరెస్ట్‌లో ఉన్నట్లు భావించాలంటూ ఒత్తిడి చేశాడు.

అనుసరించకపోతే ED, IT, CBI అధికారులు వచ్చి 90 రోజుల పాటు విచారణకు తీసుకెళ్తారని బెదిరించాడు.

‘వెరిఫికేషన్’ పేరుతో లావాదేవీలు చేయించిన గ్యాంగ్

శ్రీనివాస్‌ ఖాతాల్లో ఉన్న లావాదేవీలు మహిళల అంతర్జాతీయ ట్రాఫికింగ్‌ కేసుకు సంబంధించినవని చెప్పి, అవి క్లియర్‌ చేయాలంటూ పలు ఖాతాలకు డబ్బులు పంపాలని సూచించాడు. నిర్ధారణ తర్వాత మొత్తం రీఫండ్‌ అవుతుందని నమ్మించాడు.

కొన్ని రోజుల తర్వాత భూమి, బంగారం వివరాలు కూడా వెరిఫై చేయాలంటూ, ఇంటికి కూడా వస్తానని చెప్పాడు. అరెస్టు తప్పించాలంటే ₹1 కోటి అవసరమని, వెంటనే పంపాలని ఒత్తిడి చేశాడు. మళ్లీ రీఫండ్‌ ఇస్తానని చెప్పినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాల్‌లు నిలిచిన తర్వాత మోసం తెలిసిన డాక్టర్

తర్వాత కాల్‌లు, మెసేజులకు స్పందించకపోవడంతో తాను మోసపోయానని శ్రీనివాస్‌ గ్రహించారు. అప్పటికే ఆయన ₹36 లక్షలు పంపించారు. దీనిపై దేవీ లాల్‌ సింగ్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలని, డబ్బు తిరిగి పొందేందుకు సహాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

Tags:    

Similar News