బత్తుల ప్రభాకర్ జిత్తులు ఇన్నిఅన్నీ కాదయ్యా? విన్నోడికి విన్నంత

హైదరాబాద్ పబ్ లో పోలీసులపై కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

Update: 2025-02-07 06:23 GMT

హైదరాబాద్ పబ్ లో పోలీసులపై కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అతని ఎయిమ్ చూసిన వారు ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే. ఖరీదైన జీవితానికి అలవాటు పడిన ప్రభాకర్ అమ్మాయిలంటే తెగ పిచ్చి. తన జీవితంలో వంద మంది అమ్మాయిలను అనుభవించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది మనసులో అనుకోలేదు. తన శరీరంపై వంద అంకెతో టాటూ వేయించుకున్నాడు. పోలీసులు బత్తుల ప్రభాకర్ ను అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది. మద్యం తాగడం, అమ్మాయిలతో తిరగడం అతని ప్రధాన హాబీలు. అతని మరో లక్ష్యం కూడా ఉంది. దొంగతనాలు చేసి మూడు కోట్ల రూపాయలు సాధించడం. ఈ రెంటికి సంబంధించి తన శరీరంపై టాటూలు వేయించుకున్నాడంటే అతను ఎంత కరడుగట్టిన మనస్తత్వంతో ఉన్నాడో ఇట్టే అర్థమవుతుంది.

ఒకడ్ని చంపేందుకు...
బత్తుల ప్రభాకర్ మూడు గన్ లను బీహార్ వెళ్లి పది లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. అయితే ఇది ఎవరి మీద ప్రయోగించడానికో తెలుసా? తనకు శత్రువు ఒకడే ఉన్నాడు. విశాఖ సెంట్రల్ జైలులో తనకు శత్రువుగా మారిన మరో నిందితుడిని హతమార్చేందుకు బత్తుల ప్రభాకర్ బీహార్ వెళ్లి మరీ మూడు గన్ లను కొని తీసుకు వచ్చాడు. అతనిని చంపేందుకు ప్లాన్ చేశాడు. అయితే రివాల్వర్ పేల్చడంలో అనుభవం లేకపోవడంతో ప్రాక్టీస్ కూడా చేయడం ప్రారంభించాడు. అవుటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లోకి వెళ్లి గుట్టల్లో రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. గురి చూసి కాల్చడం నేర్చుకున్నాడు. త్వరలో తన శత్రువును హతమార్చేందుకు ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు.
చిత్తూరు జిల్లాకు చెందిన...
ఖరీదైన జీవితానికి అలవాటుపడిన ప్రభాకర్ ది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా. 2013 నుంచి చోరీలను ప్రారంభించి ఇప్పటి వరకూ అనేక సార్లు జైలు ఊచలు లెక్క పెట్టి మరీ వచ్చాడు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అతనిపై క్రిమినల్ కేసులున్నాయి. పదకొండుచోట్ల చోరీలుచేసి రెండున్నర కోట్లు దొంగిలించాడు. అంటే ప్రభాకర్ ఏ రేంజ్ లో ఆలోచిస్తాడో అర్థం చేసుకోవచ్చు. చిల్లర దొంగ కాదు. హార్డ్ కోర్ క్రిమినల్. వచ్చిన డబ్బు మొత్తాన్ని తన పేరు మీద పైసా ఉంచుకోరు. నమ్మకమైన స్నేహితుడి అకౌంట్ లోనే వేస్తాడు. అంతేకాదు మూడేళ్లుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న బత్తుల ప్రభాకర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
గురువారం మాత్రమే...
అయితే ఇతనికి ఒక స్టయిల్ ఉంది. గురువారం మాత్రమే చోరీ చేస్తాడు. శని, ఆదివారాలు మాత్రం ఫుల్లు ఎంజాయ్ చేస్తాడు. కనీసం పది లక్షలు దొరుకుతాయని అంచనా వేసి ముందుగా రెక్కీ చేసిన తర్వాతనే చోరీలు చేయడం ప్రభాకర్ లో ఉన్న మరో స్పెషాలిటీ అని పోలీసులు తెలిపారు. గురువారం చోరీ అదీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిందంటే అది ప్రభాకర్ పనేనని పోలీస రికార్డు లు చెబుతున్నాయి. అలా ఉంటది మనోడితో. అందుకే కరడు గట్టిన ఈ నేరగాడ్ని పోలీసులు పట్టుకున్నప్పటికీ అతను మళ్లీ తప్పించుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసుతున్న బత్తుల ప్రభాకర్ లైఫ్ స్టయిల్ ను చూసిన వారు ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అందుకే ఇతగాడితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతన్నారు.



Tags:    

Similar News