ఉత్తర్ ప్రదేశ్ లో లెక్చరర్ పై కాల్పులు… మృతి
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఏఎంయూ ప్రాక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ వసీం అలీ తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని ఏబీకే స్కూల్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రావు దానిష్ అలీగా గుర్తించారు. బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో యూనివర్సిటీ గ్రంథాలయం సమీపంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
చికిత్స పొందుతూ ...
“రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రంథాలయం దగ్గర కాల్పులు జరిగినట్లు సమాచారం వచ్చింది. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం తరలిస్తున్నారని చెప్పారు. అనంతరం కాల్పులకు గురైన వ్యక్తి ఏబీకే స్కూల్ అధ్యాపకుడు రావు దానిష్ అలీ అని తెలిసింది. ఆయన తలకు తూటా తగిలింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు” అని ప్రాక్టర్ మీడియాకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.