డీకే ఇంట్లో చోరీకి యత్నించిన అక్రమ్ హిస్టరీ తెలిస్తే వామ్మో అనాల్సిందే
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి ప్రయత్నించి అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి ప్రయత్నించి అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీలో అక్రమ్ పై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో ఏ నేరం జరిగినా అక్రమ్ ను అక్కడి పోలీసులు తరచూ అరెస్ట్ చేస్తుండటం, జైలుకు వెళ్లి రావడంతో విసుగుచెందిన అక్రమ్ తన మకాంను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు మార్చాడు. హైదరాబాద్ లోని పాతబస్తీలో కొంతకాలం చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితం గడిపాడు.
రెండు రోజుల రెక్కీ...
అయితే ధనవంతుల ఇళ్లలో చోరీ చేస్తే ఎక్కువ మొత్తంలో నగదు దొరుకుతుందని భావించి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. అక్రమ్ రెండు రోజుల పాటు అక్రమ్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. చివరకు ఎంపీ డీకే అరుణ ఇంటిని ఎంచుకున్నాడు. ఈ ఇంట్లోకి అయితే సులువుగా ప్రవేశించవచ్చని, అలాగే ఎవరైనా పట్టుకుంటే తప్పించుకోవడానికి వెనక మార్గం నుంచి పరారయ్యేందుకు రహదారి ఉండటాన్ని గమనించి డీకే ఇంటిని అక్రమ్ ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు.
బంగారం కనిపించినా...
అక్రమ్ కు ఒక అలవాటు ఉంది. ఎక్కడకు చోరీకి వెళ్లినా కేవలం నగదు మీద మాత్రమే అతని చూపు పడుతుంది. బంగారు, వెండి వంటి ఆభరణాల జోలికి వెళ్లడు. విలువైన వస్తువులను ముట్టుకోడని పోలీసులు తెలిపారు. వాటిని విక్రయించడం బయట కష్టమవుతుందని, సులువుగా పట్టుబడి పోతామని భావించి అక్రమ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కనిపించినా అక్కడే వదిలేస్తాడని పోలీసులు చెప్పారు. కేవలం సులువుగా బతికేందుకు నగదును అపహరించడమే మంచిదని భావించి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన అక్రమ్ దొంగతనాలకు అలవాటు పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.