Gold Rates Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు...మార్కెట్ నేడు ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి
బంగారం అంటే అమితంగా ఇష్టపడే వారికి గత కొద్ది రోజులుగా చేదు కబురు వినాల్సి వస్తుంది. వరసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పైకి ఎగబాకుతుండటం, బ్రేకుల్లేకుండా పరుగులు పెడుతుండటంతో బంగారం కొనుగోలు చేయడం గగనంగా మారింది. ఇప్పటికే లక్ష రూపాయలు దాటేసి దాదాపు నెల రోజులవుతున్నా దాని నుంచి దిగిరాకపోవగా ప్రస్తుతం మరో నాలుగు వేల రూపాయలు వరకూ పెరిగి వినియోగదారులకు, పసిడిప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఇంత రేంజ్ లో ధరలు పెరగడంతో జ్యుయలరీ దుకాణాల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయిందని అంటున్నారు.
అంచనాలకు అందకుండా...
కొంతకాలం క్రితం మార్కెట్ నిపుణులు అంచనా వేసిన ప్రకారం బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే మరికొందరు అంచనా వేసినట్లు పది గ్రాముల బంగారం ధర యాభై వేల రూపాయలకు చేరుకుంటుందని వేసిన అంచనాలు మాత్రం అస్సలు కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరగడమే కాని, తగ్గడం అనేది జరగడం లేదు. గత వారం రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధర దాదాపు మూడు వేల రూపాయల వరకూ పెరిగిందంటే ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే, తరుగు, జీఎస్టీ వంటి అదనపు రుసుములతో లక్షన్నర రూపాయల వరకూ అవుతుంది.
ధరలు పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ, పండగల సీజన్ అయినప్పటికీ బంగారం ధరలు అమాంతం పెరగడంతో వాటిని కొనుగోలు చేసేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు సయితం ధరలు పతనమవుతాయేమోనన్న ఆందోళనతో కొనుగోలు చేయడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 96,190 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,04,940 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,34,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరగవచ్చు.