ఈనాడు రోజులు కావు.. ఇంటర్నెట్ యుగమిది బాబూ.! వైసీపీ ఎంపీ

Update: 2022-09-05 14:16 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఒంటికాలిపై లేచే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసులకు వెనకాడొద్దని.. అవసరమైతే పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు వేయండంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. కార్యకర్తలు చట్టాన్ని ధిక్కరించి జైలుకు వెళ్తే అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర సమరయోధుల తరహాలో పెన్షన్లు, సౌకర్యాలు కల్పిస్తావా? అమాయకులను జైళ్లకు పంపి మీ తండ్రీకొడుకులు తమాషా చూస్తారా! అన్యాయం కదా బాబన్నా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ త్యాగాలేవో మీరే చేస్తే కుల మీడియా ఫుల్ కవరేజీ ఇస్తుందని అన్నారు.

దొంగే దొంగ అని అరవడం.. ఆ తర్వాత దొరికిపోవడం చంద్రబాబు ప్రత్యేకత అని విజయసాయి అన్నారు. ఆయన ఆరోపణలు కుల మీడియాలో భజకు మినహా నమ్మశక్యంగా ఉండవని.. విశ్వసనీయత లేని వ్యక్తులు తమ తప్పులను ఇతరులపైకి నెట్టడం బాబుతోనే మొదలైందన్నారు. బహుశా ఆయనతోనే ముగిసిపోవచ్చన్నారు. రాజకీయ పోరాటం ఎప్పుడూ ఎన్నికల రణక్షేత్రంలోనే తేల్చుకోవాలని.. గెలుపుతోనే సాధించుకోవాలని వైసీపీ ఎంపీ అన్నారు. సాముగరిడీల చంద్రబాబు కుల మీడియా విషపు రాతలతో విజయం వరిస్తుందనే భ్రమల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈనాడు రోజులు కావు.. ఇంటర్నెట్ యుగమిదంటూ చురకలంటించారు.

Tags:    

Similar News