YS Sunitha:వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్.. ప్రజాకోర్టులో తీర్పు కావాలి

దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు

Update: 2024-03-01 07:19 GMT

YS Sunitha:దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. గత కొన్ని నెలలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేసిన వైఎస్ సునీత తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా వైసీపీని గెలిపించకూడదని చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ లో హత్యా రాజకీయాలు ఉండకూడదని పిలుపును ఇచ్చారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని.. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు.

వైఎస్ వివేకా ఐదేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు.. ఐదేళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు సునీత. కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, తీర్పు నాకు కావాలన్నారు. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది.. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారు.. సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం, ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందన్నారు. వివేకా హత్యకేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారని.. సీబీఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ ను అడిగానన్నారు. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇప్పటికీ అక్కడే ఉంది.. నాకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని అన్నారు సునీత. ముందు సీబీఐ విచారణకు ఆదేశించిన పిటిషన్ కు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్ డ్రా చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు సునీత. విలువలు, విశ్వసనీయత పదే పదే అంటుంటారు.. మాట తప్పను, మడమ తిప్పను అంటుంటారు – మా నాన్న హత్య కేసులో ఇవన్నీ ఏమయ్యాయి?.. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుందన్నారు. హత్యా రాజకీయాలు ఉండకూడదు.. జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దన్నారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారు. జగన్ పాత్రపై విచారణ జరగాలి, నిర్దోషి అయితే వదిలేయాలి. జగన్ కేసుల వల్లే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారన్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు.. షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు.


Tags:    

Similar News